● పోర్టు ఏజెన్సీ నిర్వాహకులతో అచ్చెన్న రూ.40 కోట్ల ఇంటిని కట్టించుకుంటున్నారు
● వైఎస్సార్‌సీపీ టెక్కలి సమన్వయకర్త పేరాడ తిలక్
టెక్కలి: మూలపేట పోర్టు పరిశీలనకు అనుమతులు ఇచ్చామని మంత్రి అచ్చెన్నాయుడు చెబుతున్నారని, దమ్ముంటే అనుమతి పత్రాలను బహిర్గతం చేయాలని వైఎస్సార్‌సీపీ టెక్కలి నియోజకవర్గ ఇన్‌చార్జి పేరాడ తిలక్ సవాల్ చేశారు. ఇటీవల వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన పోర్టుకు పోదాం పదండి కార్యక్రమంపై మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై గురువారం టెక్కలిలో మీడియా సమావేశం నిర్వహించి మండిపడ్డారు. పోర్టుకు పోదాం పదండి కార్యక్రమానికి సంబంధించి మార్చి 17న ఎస్పీకి దరఖాస్తు చేసుకోగా 29వ తేదీ సాయంత్రం ఆంక్షలతో సభకు మాత్రమే అనుమతులు ఇచ్చారని తిలక్ గుర్తు చేశారు. పోర్టుకు పోదాం పదండి కార్యక్రమంలో భాగంగా అన్ని రకా ల మీడియాల ద్వారా వాస్తవాలు బయట ప్రపంచానికి తెలియడంతో కేంద్ర, రాష్ట్ర మంత్రుల బండారం బయటపడిందన్నారు. పోర్టు పనుల విషయంలో 2024 ఎన్నికల నాటికి ఆయా ఏజెన్సీకి ఇచ్చిన బిల్లులను బహిర్గతం చేస్తే ఎంత మేరకు పనులు జరిగాయో పురోగతి అందరికీ తెలుస్తుందని తిలక్ అన్నారు. చంద్రబాబు హయాంలో భావనపాడు పోర్టు పనులు ప్రారంభించామని చెబుతున్నారని, అయితే దానికి సంబంధించిన అనుమతులు బహిర్గతం చేయాలని తిలక్ డిమాండ్ చేశారు. పోర్టు పనులు పూర్తి చేయకుండా ఆయా ఏజెన్సీని బెదిరించి విశాఖపట్టణంలో అచ్చెన్నాయుడు రూ.40 కోట్ల ఇల్లు కట్టించుకుంటున్నారని తిలక్ ఆరోపించారు. పోర్టు పూర్తి చేయడానికి గత సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్ని రకాల భూసేకరణలు, అనుమతులతో పనులు ప్రారంభించారని ఇప్పుడు అర్ధంతరంగా 36 వేల ఎకరాలు సేకరించాల్సిన అవసరం ఏముందని తిలక్ ప్రశ్నించారు. కేవలం భూములను దోపిడీ చేయడానికే ల్యాండ్ పూలింగ్‌కు తెర తీస్తున్నారని స్పష్టం చేశారు. ఇకనైనా అచ్చెన్నాయుడు నిజాలు మాట్లాడాలని హితవు పలికారు. సమావేశంలో నందిగాం ఎంపీపీ ఎన్.శ్రీరామ్ముర్తి, నాయకులు సత్తారు సత్యం, కె.జీవన్, ఎస్.వినోద్, బి.రాజేష్ తదితరులు ఉన్నారు.


