‘వ్యక్తిగత దూషణలు సరికాదు’ | - | Sakshi
Sakshi News home page

‘వ్యక్తిగత దూషణలు సరికాదు’

Apr 3 2026 7:08 AM | Updated on Apr 3 2026 7:08 AM

ఆమదాలవలస: ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌ తల పొగరుతో వ్యక్తిగత దూషణలు చేస్తున్నారని, వాటిని తగ్గించుకుంటే మంచిదని వైఎస్సార్‌కాంగ్రెస్‌పార్టీ ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్‌ అన్నారు. ఆమదాలవలసలో పార్టీ కార్యాలయంలో గురువా రం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇటీవల టీడీపీ ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న కూన అనుచిత వ్యాఖ్యలు చేశారని, అదే రోజు ఆమదాలవలసలో వైఎస్సార్‌సీపీ నిర్వహించిన సర్పంచ్‌ల అభినందన సభకు హాజరైన జనాలను చూసి మతిభ్రమించి మాట్లాడారని అన్నారు. ప్రతి సమావేశంలోనూ చింతాడ రవికి ఉన్న స్థాయి ఏంటి అనే మాట్లాడుతున్నారని, కానీ ఎమ్మెల్యే తన స్థాయి మరిచి మాట్లాడడం సరికాదన్నారు. సొంత గ్రామం పొందూరు మండలం పెనుపర్తి గ్రామంలోనే కూన రవికుమార్‌ ఎంపీటీసీగా, సర్పంచ్‌గా పోటీ చేసి ఓడిపోయారని గుర్తు చేశారు. నీరు–చెట్టు పనుల డబ్బులు సొంత ఖాతాలకు మళ్లించుకున్నారని ఆరోపించారు. నియోజకవర్గంలో ఎన్నో భూ ఆక్రమణల ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలే తన బలమని స్పష్టం చేశారు.

మేనమామ లేకుంటే ఆయన పరిస్థితి ఏమిటో కూన రవి ఆలోచించుకోవాలన్నారు. ఓటుకు రూ. 5000 ఇచ్చి ప్రజలను కొంటానని చెబుతున్న రవి అక్రమార్జన ఎంత ఉందో తెలుస్తోందన్నారు. వైఎస్‌ జగన్‌ ఐదేళ్లలో జిల్లాకు అనేక ప్రాజెక్టులు తీసుకువచ్చారని, టీడీపీ 17 ఏళ్లలో ఏం చేసిందో చెప్పగలరా అంటూ సవాల్‌ విసిరారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బొడ్డేపల్లి రవికుమార్‌, సరుబుజ్జలి జెడ్పీటీసీ సురవరపు నాగేశ్వరరావు, సరుబుజ్జిలి మండల పార్టీ అధ్యక్షులు బెవర మల్లేశ్వరరావు, ఆమదాలవలస పట్టణ పార్టీ అధ్యక్షులు పొడుగు శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి పొన్నాడ చిన్నారావు, పార్టీ ముఖ్య నాయకులు గురుగుబెల్లి శ్రీనివాసరావు, దుంపల శ్యామలరావు, లక్ష్మినారాయణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement