● మంత్రి అచ్చెన్న వ్యాఖ్యలపై పేరాడ తిలక్ మండిపాటు
టెక్కలి: మూలపేట పోర్టు పరిశీలనకు అనుమతులిచ్చామని మంత్రి అచ్చెన్నాయుడు చెబుతున్నారని.. అయితే అనుమతులు ఇచ్చినపుడు భారీగా పోలీసులు తుపాకులతో మోహరించాల్సిన అవసరం ఏముందని వైఎస్సార్‌సీపీ టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్ మండిపడ్డారు. టెక్కలిలో బుధవారం ఆయన మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన మూలపేట పోర్టుకు పోదాం పదండి కార్యక్రమం విజయవంతం కావడంతో, మంత్రి అచ్చెన్నాయుడు మతిభ్రమించి పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఉత్తరాంధ్రలో వైఎస్సార్‌సీపీకి చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పోర్టు పరిశీలనకు సిద్ధమైన తరుణంలో లేనిపోని ఆంక్షలు విధించారని దుమ్మెత్తిపోశారు. కనీసం బహిరంగ సభకు సైతం చివరి నిమిషం వరకు అనుమతులు ఇవ్వకుండా తాత్సారం చేశారని గుర్తు చేశారు. మూలపేటకు వెళ్లే రహదారిలో ముళ్ల కంచెలు, తుపాకులతో భారీగా పోలీసులను ఎందుకు పెట్టారన్నారు. పోర్టు పరిశీలన చేపట్టినట్లయితే కూటమి నాయకుల నిర్లక్ష్యం బయటపడుతుందనే భయంతోనే పరిశీలనకు అడ్డుపడ్డారని ధ్వజమెత్తారు. దశాబ్ధాల కాలంగా కింజరాపు కుటుంబం ఈ జిల్లాకు ఏం మంచి చేసిందని ప్రశ్నించారు. ఇకనైనా అచ్చెన్నాయుడు నోరు అదుపులో పెట్టుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.


