టెక్కలి: టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఆదివారం రగ్బీ జిల్లా జట్లు ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా రగ్బీ అసోసియేషన్ అధ్యక్షుడు డొంకాన రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి పి.పార్వతీశం, ఆర్గనైజర్ బి.నారాయణరావు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. మెన్ అండ్ ఉమెన్ కేటగిరిలో నిర్వహిస్తున్న ఎంపికల్లో భాగంగా ఉదయం 9 గంటల నుంచి ఎంపికలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. క్రీడాకారులు ఆధార్ కార్డు, జనన ధ్రువీకరణ పత్రంతో హాజరు కావాలని కోరారు. మరిన్ని వివరాలకు 8500007272, 7842423423 నంబర్లకు సంప్రందించాలని కోరారు.
108లో గిరిజన గర్భిణి ప్రసవం
కొత్తూరు: చిన్నరాజపురం గ్రామానికి చెందిన 26 ఏళ్ల గిరిజన మహిళ సవర జ్యోతి నిండు గర్భిణి. శుక్రవారం పురిటి నొప్పులు రావడంతో కొత్తూరు 108 అంబులెన్సుకు సమాచారం అందించారు. వెంటనే సిబ్బంది చేరుకొని గర్భిణిని హిరమండలం పీహెచ్‌సీకి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డలు క్షేమంగా ఉండటంతో హిరమండలం పీహెచ్‌సీలో చేర్చించినట్లు ఈఎంటీ ఎం.కృష్ణ, పైలట్ గోవిందరావు తెలిపారు.
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లా కేంద్రంలోని గొంటివీధి సమీపంలో ఓ ప్లై వుడ్ ఎంటర్‌ప్రైజెస్ దుకాణంలో శుక్రవారం వేకువఝామున విద్యుత్తు షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో రూ.6 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లింది. అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపిన వివరాల మేరకు.. పెద్దపాడురోడ్డులోని కిల్లిపాలెం యూనియన్ బ్యాంకు సమీపంలో అద్దె ఇంట్లో 62ఏళ్ల వృద్ధుడు దుర్గ విజయ్‌కుమార్ తన భార్య, ఇద్దరు కుమార్తెలతో నివాసముంటున్నాడు. గొంటివీధిలో అద్దెషాపులో ప్లై వుడ్, ఫర్నిచర్ అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం వేకువజామున 2.05 గంటలకు షాపులో అగ్నిప్రమాదం సంభవించినట్లు సమాచారం అందడంతో సిబ్బందిని పంపించి మంటలను అదుపు చేశామని ఏడీఎఫ్‌వో శ్రీనుబాబు తెలిపారు. ఇన్‌వాల్వ్‌డ్ మెటీరియల్, డ్రెస్సింగ్ టేబుల్ మెటీరియల్, గ్లాస్, కంప్యూటర్, ప్రింటర్, రివాల్వింగ్ కుర్చీలు, ఫర్నిచర్ మెటీరియల్ కాలి బూడిదయ్యాయని చెప్పారు. బ్యాంకు రుణాలతో గొంటివీధి, న్యూకాలనీలో అద్దె షాపులు నడుపుతున్నానని, ఎటువంటి ఆస్తిపాస్తులు లేవని, కుమార్తెలకు వివాహం చేయాల్సిన సమయంలో ఈ కష్టమొచ్చిందని బాధితుడు వాపోయాడు.
హోటళ్లలో విజిలెన్స్ దాడులు
పొందూరు: మండలంలోని పలు హోటళ్లలో విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు శుక్రవారం ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. కమర్షియల్ సిలిండర్లకు బదులుగా ఏడు గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లు వినియోగిస్తుండటంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు. పలువురిపై 6ఏ కేసులను నమోదు చేసినట్లు విజిలెన్స్ ఎస్‌ఐ రామారావు తెలిపారు. తనిఖీల్లో ఇన్‌చార్జి ఆర్‌ఐ జగదీష్, వీఆర్‌వో రేవతిరావు, సిబ్బంది పాల్గొన్నారు.
వేర్వేరు ప్రమాదాల్లో
ఇద్దరు మృతి
నరసన్నపేట: మండల పరిధిలోని కామేశ్వరిపేట, దాసరివానిపేట వద్ద రైల్వేలైన్‌పై శుక్రవారం జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఆమదాలవలస రైల్వే హెచ్‌సీ మధుసూదనరావు తెలిపిన వివరాలు మేరకు.. కామేశ్వరిపేట వద్ద వంశధార వంతెనపై ట్రాక్ వద్ద వెల్డింగ్ పనులు చేస్తున్న తిలారుకు చెందిన కోట అప్పారావు(29) ప్రమాదవశాత్తూ ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టడంతో మృతి చెందాడు. అలాగే దాసరివానిపేట వద్ద జరిగిన మరో ప్రమాదంలో గుర్తు తెలియని రైలు ఢీకొని గంజాం జిల్లా కాలీకట్ ప్రాంతానికి చెందిన ఎస్.బి.పాణిగ్రహి(35) మృతి చెందాడు. ఈ రెండు ప్రమాదాలపై కేసు నమోదు చేశామని, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించామని హెచ్‌సీ తెలిపారు.


