ప్రభుత్వ విప్‌ అశోక్‌ బహిరంగ క్షమాపణ చెప్పాలి | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ విప్‌ అశోక్‌ బహిరంగ క్షమాపణ చెప్పాలి

Mar 28 2026 7:12 AM | Updated on Mar 28 2026 7:12 AM

శ్రీకాకుళం (పీఎన్‌ కాలనీ): ఇచ్ఛాపురం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ బెందాళం అశోక్‌ ఆదివాసీల అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని, తక్షణమే బహిరంగ క్షమాపణలు చెప్పాలని ఆదివాసీ జేఏసీ ముఖ్య సలహాదారుడు వాబ యోగి, జేఏసీ జిల్లా అధ్యక్షుడు సవర రాంబాబు డిమాండ్‌ చేశారు. జిల్లా కేంద్రంలోని క్రాంతి భవనంలో శుక్రవారం వారు విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో ఆదివాసీలు ఎవరనే విషయాన్ని ముందుగా తెలుసుకోవాలన్నారు. జిల్లాలో బెంతు ఒరియా తెగ లేదని అనేక కమిటీలు ప్రభుత్వానికి నివేదికలు తెలియజేశాయని గుర్తు చేశారు. గతంలో నకిలీ బెంతు ఒరియా ఎస్టీ సర్టిఫికెట్లను కలెక్టర్‌ రద్దు చేశారని చెప్పారు. ఎమ్మెల్యే అశోక్‌ ఇవేవీ తెలుసుకోకుండా ఆదివాసీ నాయకులను పరుషపదాలతో దూషించడం సరికాదన్నారు. ఆదివాసి సమాజానికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఇచ్ఛాపురం నియోజకవర్గంలో ఉన్న నకిలీ బెంతు ఒరియాలు 27 వేలమంది గురించి పదేళ్లుగా ఫైల్‌ పట్టుకుని తిరుగుతున్నానని చెప్పడం విడ్డూరంగా ఉందని, మీ నియోజకవర్గంలో మా ఆదివాసీ ప్రజలు కూడా ఉన్నారని గుర్తు చేశారు. వారి సమస్యలపై స్పందించరెందుకని ప్రశ్నించారు. జేఏసీ ప్రధాన కార్యదర్శి గురాడి అప్పన్న మాట్లాడుతూ ఎమ్మెల్యే అశోక్‌ వైఖరి సరికాదన్నారు. జిల్లాలో రెండు లక్షల ఆదివాసి జనాభా మనోభావాలు దెబ్బతీసిన మీకు సరైన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. సమావేశంలో సవర జగన్నాయకులు, ఆలిండియా ఫెడరేషన్‌ ఉద్యోగ సంఘాల రాష్ట్ర ఉపాధ్యక్షుడు సవర భాస్కరావు, సవర కుమార్‌, జిల్లా అధ్యక్షుడు సవర చుక్కారావు, గిరిజన చైతన్య వేదిక జిల్లా అధ్యక్షుడు సవర సోమేశ్‌రావు, జన్ని కాంతారావు, బండపల్లి రాకేష్‌, సవర రామారావు, జన్ని వాసు చంద్రశేఖర్‌, అప్పన్న తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే అశోక్‌ గిరిజనులకు క్షమాపణ చెప్పాలి

కొత్తూరు : ఆదివాసీ గిరిజనులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ క్షమాపణ చెప్పాలని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి నిమ్మక అప్పన్న డిమాండ్‌ చేశారు. కొత్తూరు మండలం గొట్టిపల్లి గ్రామంలో ఆదివాసీ గిరిజనులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే అశోక్‌ క్షమాపణ చెప్పకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామన్నారు. క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేకు సమస్యలు వివరించేందుకు వెళ్లిన ఆదివాసీలను కించపరిచేలా మాట్లాడటం సరికాదన్నారు. బెంతు ఒరియాలను గిరిజన జాబితాల్లో చేర్పించాలని గిరిజన నేతలకు చెప్పడం భావ్యం కాదన్నారు. కార్యక్రమంలో గిరిజన నాయకులు ఆరిక శివ, నిమ్మక గణపతి, నిమ్మ రత్నాలు పాల్గొన్నారు.

క్షమాపణలు చెప్పకపోతే ఉద్యమమే

మందస : ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ గిరిజన సమాజానికి క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో ఉద్యమం తప్పదని గిరిజన ఐక్య వేదిక మందస మండల అధ్యక్షుడు ఎస్‌.బిట్టుబాబు(నీలకంఠం) స్పష్టం చేశారు. శుక్రవారం పద్మపురం గ్రామంలో ఆయన మాట్లాడుతూ ఆదివాసీ గిరిజనులను అవమానించేలా ఎమ్మెల్యే అశోక్‌ అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. ప్రజాప్రతినిధిగా ఉంటూ గిరిజనుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించడం దురదృష్టకరమన్నారు. వెంటనే క్షమాపణ చెప్పకపోతే గిరిజన సమాజం ఐక్యంగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతుందని చెప్పారు. కార్యక్రమంలో వేదిక ప్రతినిధులు ఎం.చూడామణి, ఎం.దాడు, ఎస్‌.డొంబురు, ఎస్‌.మోహనరావు, పి.నీలకంఠం పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement