● రబీ వరి పంటపై తీవ్ర ప్రభావం
● పలుచోట్ల నేలవాలిన పైరు
● రాలిన మామిడిపిందెలు
సారవకోట/మెళియాపుట్టి: జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న వడగళ్ల వాన రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. రబీ వరి పంటతో పాటు మామిడి, మిరప సాగులపై అకాల వాన తీవ్ర ప్రభావం చూపుతోంది. సారవకోట మండలంలోని పొప్పంగి సమీపంలో రంగసాగరం ఆయకట్టును నమ్ముకుని ఈ ఏడాది రబీలో స్థానిక రైతులు వరి సాగు చేస్తున్నారు. వాతావరణం అనుకూలించకపోవడంతో పంట దిగుబడి బాగా తగ్గింది. గత ఏడాది కరాకు సుమారు 35 నుంచి 40 బస్తాలు రాగా, ఈ ఏడాది పొల్లు గింజలు అధికంగా కనిపిస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎకరా వరి పంటకు సుమారు 8 నుంచి 10 బస్తాల వరకు పొల్లు గింజలు వచ్చాయని సారవకోట, గొర్రిబంద గ్రామాలకు చెందిన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రంగసాగరం ఆయకట్టు ప్రాంతంలోని జగన్నాథపురం, జగ్గయ్యపేట, బురుజువాడ, రైవాడ, కొత్తూరు, అగదల, సవరపేట, సారవకోట, గోపాలపురం, వండానవలస తదితర గ్రామాలలో ఈ ఏడాది సుమారు 2000 ఎకరాలలో వరి సాగు చేశారు. ఈ తరుణంలో గురువారం సాయంత్రం కురిసిన వడగళ్ల వానతో కోత దశకు వచ్చిన పంట చాలా వరకు నేల రాలిపోయిందని రైతులు వాపోతున్నారు. ఎన్నడూ లేని విధంగా వడగళ్లు పడటంతో పంట నష్టం వాటిల్లినట్లు చెబుతున్నారు. ఇప్పటికే పొల్లు గింజల వల్ల దిగుబడి తగ్గిపోగా తాజాగా వడగళ్ల వానతో పంట నేల రాలి పోయిందని ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో రైతులు 82 కేజీల ధాన్యాన్ని రూ.1200కే దళారులు కొనుగోలు చేసి ఇతర జిల్లాలకు తరలిస్తున్నారు. మెళియాపుట్టి మండలం జోడూరు గ్రామానికి చెందిన కమిరి సోమేశ్వరరావు, బి.ధర్మారావులకు చెందిన మిరప, నువ్వు, మామిడి పంట అంతా రాలిపోయింది. అధికారులు పరిశీలించి నష్ట పరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
నేలవాలింది..
గురువారం కురిసిన వడగళ్ల వానతో వరి పంట చాలా వరకు నేలవాలింది. ఇంత వరకు ఎన్నడూ చూడని విధంగా వడగళ్లు పడ్డాయి. ఈ ఏడాది పొల్లు గింజలు అధికంగా రావడంతో దిగుబడి బాగా తగ్గింది.
– చెంచల చంద్రరావు, రైతు, గొర్రిబంద,
సారవకోట మండలం


