సారవకోట: మండలంలో గురువారం కురిసిన వడగళ్ల వానతో రైతులు తీవ్ర అవస్థలు పడ్డారు. గత మూడు రోజుల నుంచి రబీలో వరి కోతలు చేపట్టి ధాన్యం జాతీయ రహదారి 326ఎపై ధాన్యం ఆరబెడుతున్నారు. అయితే వర్షం కురవడంతో రైతులు వాటిని చక్కబెట్టుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అలాగే రైస్ మిల్లుల ఆవరణలో ఉన్న ధాన్యం బస్తాల పై టార్పాలిన్లు కప్పి ధాన్యం బస్తాలను కాపాడుకునే ప్రయత్నం చేశారు. సుమారు అరగంటకు పైగా వడగళ్లతో కూడిన వర్షం కురవడంతో కొన్ని దగ్గర ధాన్యం తడిసి పోయాయి.
హిరమండలం: హిరమండలం, ఎల్‌ఎన్‌పేట మండలాల్లో గురువారం వడగళ్ల వాన ముంచెత్తింది. మధ్యాహ్నం వరకూ ఎండ ఉండగా ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమైంది. ఈదురు గాలులు వీయడంతో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. రోడ్డుపై వడగళ్లు పడడంతో అందరూ ఆశ్చర్యపడ్డారు. జీడి మామిడి పూత దశలో నష్టం కలుగుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఆమదాలవలస: ఆమదాలవలస పట్టణంలో గురువారం సాయంత్రం వడగళ్ల వాన కురిసింది. దీంతో ప్రయాణికులు, ప్రజలు కాసేపు బెంబేలెత్తిపోయారు.
రైతులకు తీవ్ర నష్టం
బూర్జ: మండలంలో గురువారం సాయంత్రం పడిన వడగళ్ల వర్షంతో పండ్ల తోటలకు తీవ్రనష్టం వాటిల్లిందని రైతులు వాపోతున్నారు. ఇటీవల తేనె మంచు ప్రభావంతో జీడిమామిడితోట లు పూర్తిగా పువ్వు, పింజ దశల్లో మాడిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పడిన ఆకాల వర్షంతో మామిడి, జీడి రైతులు నానా ఇబ్బందులు పడ్డారు.


