ఆగి ఉన్న లారీని ఢీకొన్న బైక్
తల్లీకొడుకులు మృతి
మృతులు విశాఖ వాసులు
ఎచ్చెర్ల: జాతీయ రహదారి మళ్లీ రక్తం పూసుకుంది. వరుస పెట్టి జరుగుతున్న ఘటనలతో రోడ్డు మళ్లీ మరణ సంకేతాలను పంపించింది. గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లీకొడుకులు కన్నుమూశారు. దైవ దర్శనం కోసం వచ్చి తిరిగి వెళ్తుండగా ఇలా మృత్యు కౌగిలిలో చిక్కుకున్నారు. అరిణాం అక్కివలస గ్రామం సమీపంలో బైక్ లారీని ఢీకొన్న ఘటనలో విశాఖపట్నం సెంగలరావుపేటకు చెంది న తల్లీ కొడుకులు నాగమణి(55), సీహెచ్ నరేంద్రకుమార్(32) మృతి చెందారు. వివరాల్లోకి వెళితే..
సెంగలరావుపేటకు చెందిన తల్లీకొడుకులు అరసవల్లి సూర్యనారాయణ మూర్తి దర్శనం కోసం బైక్‌పై వచ్చారు. స్వామిని దర్శించుకుని తిరిగి వెళ్తుండగా అరిణాం అక్కివలస వద్ద ఆగి ఉన్న లారీని వీరి బైక్ ఢీకొట్టింది. దీంతో బైక్ నడుపుతున్న నరేంద్రతో పాటు వెనుక కూర్చున్ని తల్లి కిందకు పడిపోగా.. ఇద్దరూ ఘటనా స్థలంలోనూ ప్రాణాలు వదిలేశా రు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను రిమ్స్‌కు తరలించారు. ఎచ్చెర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యా ప్తు చేస్తున్నారు. నరేంద్రకుమార్‌కు వివాహమై ఓ పాప ఉంది.


