గురిపెడితే.. గోల్‌.! | - | Sakshi
Sakshi News home page

గురిపెడితే.. గోల్‌.!

Mar 10 2026 7:11 AM | Updated on Mar 10 2026 7:11 AM

కంచిలి:

జిల్లాలోని ఉద్దాన ప్రాంతంలో మారుమూల వ్యవసాయ కూలీ కుటుంబంలో జన్మించి, గోల్‌షాట్‌బాల్‌ క్రీడలో జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరుస్తోంది కంచిలి మండలంలోని కేసరపడ పంచాయతీ జక్కర గ్రామానికి చెందిన బసవ శ్యామల. ఈమె ఇదివరకే జట్టులో కీలకంగా వ్యవహరించి ఛాంపియన్‌ షిప్‌ దక్కించుకుంది. అలాగే ఈ క్రీడలో జూనియర్స్‌కు మెలకువలు నేర్పిస్తూ ముందుకెళ్తోంది. శ్యామల తల్లిదండ్రులు తరిణి, తులసిలు గ్రామంలో వ్యవసాయ కూలీలుగా ఉన్నారు. తన సోదరుడు కూడా గ్రామంలో తల్లిదండ్రులకు సాయంగా ఉన్నాడు. శ్యామల పీఈటీ కోర్సు పూర్తిచేసి ఉద్యోగ అన్వేషణలో ఉన్నారు. కవిటిలోని ఒక ప్రైవేటు కళాశాలలో డిగ్రీ పూర్తిచేసి, విజయనగరంలోని ఒక ప్రైవేటు కళాశాలలో పీఈటీ కోర్సును పూర్తి చేశారు. ఈ కోర్సు చేసేటప్పుడే ఈ క్రీడను నేర్చుకొని పలు పోటీల్లో పాల్గొని విజయం సాధించారు. దీంతో రాష్ట్ర జట్టులో చోటు దక్కించుకున్నారు. గతంలో ఇచ్ఛాపురంలో నియోజకవర్గ స్థాయిలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్రా పోటీల్లో చక్కని ప్రతిభ కనబరిచి అందరి దృష్టిని ఆకర్షించింది.

సాధించిన విజయాలు

● శ్యామల తమిళనాడు రాష్ట్రం తిరుచునాపల్లిలో గతేడాది డిసెంబర్‌ 25 నుంచి 28వ తేదీ వరకు నిర్వహించిన జాతీయ స్థాయి థర్డ్‌ ఫెడరేషన్‌ కప్‌ సీనియర్‌ మెన్‌ అండ్‌ ఉమెన్‌ గోల్‌ షాట్‌బాల్‌ పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌ మహిళా జట్టు ఛాంపియన్‌షిప్‌ 2025–26ను దక్కించుకుంది. ఈమె అనంతపురం జిల్లా కదిరి మండలం ఎరుకులవాండ్లపల్లిలో రాష్ట్రస్థాయి శిక్షణా శిబిరంలో సాధన చేసింది.

● జాతీయ స్థాయి పోటీలు జరిగిన తర్వాత ఇంటి వద్ద ఉంటూ ఉద్యోగ అన్వేషణలో ఉన్న ఈమెకు జూనియర్‌ క్రీడాకారులకు కోచ్‌గా వ్యవహరించే అవకాశం వచ్చింది. ఆంధ్రా టీమ్‌లో ఆడేందుకు ఎంపికై న సోంపేట బాలికోన్నత పాఠశాల, రాజపురం బాలుర ఉన్నత పాఠశాల నుంచి చెరో ఇద్దరికి జనవరి 29 నుంచి ఫిబ్రవరి 6 వరకు తిరుపతి వద్ద బాకరపేటలో క్యాంప్‌ పెట్టి కోచింగ్‌ ఇచ్చారు.

● తిరుపతిలో జాతీయ స్థాయి పోటీలు నిర్వహించగా, ఇక్కడ ఆంధ్రా టీమ్‌–4లో ఆడారు. ఈ విధంగా శ్యామల తన చదువుతో పాటు ఇష్టపడి నేర్చుకొన్న క్రీడలో రాణించి జాతీయ స్థాయిలో ప్రతిభ కనబర్చడమే కాకుండా, కొత్త జనరేషన్‌కు కూడా తర్ఫీదునిస్తూ మెలకువలను నేర్పించడం గర్వించదగ్గ విషయం. శ్యామల క్రీడా నైపుణ్యం ప్రదర్శించడంపై ఉద్దాన ప్రాంతంలో పలువురు అభినందిస్తున్నారు.

గోల్‌

షాట్‌బాల్‌లో

రాణిస్తున్న శ్యామల

జాతీయ స్థాయిలో సత్తాచాటిన

క్రీడాకారిణి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement