మొక్కజొన్నపై మక్కువ..!
● అధిక విస్తీర్ణంలో ఈ ఏడాది సాగు
● ఎరువుల కొరతపై ఆందోళన
మొక్కజొన్న పంట మొక్క దశ నుంచి పంట ఏపుగా పెరిగే వరకు కత్తెర పురుగు తీవ్రత ఉంటుంది. పంటను ఒకటి రెండు రాత్రుల్లోనే పూర్తిగా తినేసేవిధంగా వ్యాప్తి చెందుతుంది. ఇదే సమయంలో రైతులు ఆప్రమత్తంగా ఉంటే వీటి దాడి నుంచి పంటను రక్షించుకోగలము. అలాగే ఒకే ఏరియాలో సుమారు 10 నుంచి 15 ఎకరాల వరకు సాగు చేస్తే పంట నష్టం తగ్గించడం సులభమవుతుంది.
– కింజరాపు రవి కుమార్,
మండల వ్యవసాయ అధికారి, జలుమూరు
జలుమూరు: ఆరుతడి పంటల్లో మొక్కజొన్న రైతులకు ప్రధాన పంట. ఈ పంట సాగులో తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం పొందవచ్చు. అందువలన సాగుకు రైతులు అధికంగా ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో గతేడాది కంటే ఈ ఏడాది 30 శాతం సాగు విస్తీర్ణం పెరిగినట్లు వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ఇదివరకు జిల్లావ్యాప్తంగా అధికంగా లావేరు, ఎచ్చెర్ల, రణస్థలం, కొత్తూరు, హిరమండలం, ఎల్‌ఎన్‌పేట, పోలాకి, జలుమూరు మండలాల్లో సాగు చేసేవారు. అయితే ఈ ఏడాది నుంచి నరసన్నపేట, సారవకోట, కోటబొమ్మాళి, సంతబొమ్మాళి, టెక్కలి, గార, శ్రీకాకుళం రూరల్ తదితర మండలాల్లోనూ సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. చాలా వరకూ ఇప్పటికే మొక్కజొన్న వేయగా.. మరికొన్ని మండలాల్లో సైతం ప్రస్తుతం సాగుకు సమయాత్తమవుతున్నారు. ఇప్పటికే ఆయా పొలాలను ట్రాక్టర్, రోటావేటర్‌తో సిద్ధం చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది రబీలో 70.319 వేల హెక్టార్లలో మొక్కజొన్న సాగు చేయనున్నట్లు అంచనా.
యూరియాకు డిమాండ్
గడిచిన ఖరీఫ్‌లో వరిపంటలో యూరియాకు రైతులు అష్టకష్టాలు పడ్డారు. దీంతో ప్రస్తుత రబీకు కూడా ఇదే దుస్థితి నెలకొందని రైతులు అందోళన చెందుతున్నారు. మొక్కజొన్నకు ప్రధాన ఎరువు యూరియా కాగా.. కాంప్లెక్స్ తదితర ఎరువుల అవసరం కూడా ఉంటుంది. ఎకరాకు సుమారు ఎనిమిది నుంచి పది బస్తాలు వరకు ఆయా ఎరువులు తప్పనిసరి. మొదటి దశలో మొక్కజొన్న వేసిన రైతులు యూరియా ఇప్పటికే మొదటి ఎరువుగా వేయడం జరిగింది. ఇక రెండోసారి కోసం లావేరు, రణస్థలం, ఎచ్చెర్ల తదితర మండలాల్లో ఎరువుల షాపుల వద్ద క్యూ కడుతున్నారు. ఇదే అదునుగా ప్రైవేట్ వ్యాపారులు రైతులకు వివిధ రకాల ఎరువులను అంటగడుతున్నారు. దీంతో వాటి అవసరం లేకపోయినా రైతులు తప్పనిసరి పరిస్థితుల్లో కొనుగోలు చేయాల్సి వస్తోంది. మరోవైపు కొందరు ధాన్యం వ్యాపారులు కూడా ఎటువంటి లైసెన్స్ లేకుండా గ్రామాల్లో లారీలతో యూరియా తెచ్చి అమ్మకాలు చేస్తున్నారు.
కత్తెర పురుగు ప్రమాదం
మొక్కజొన్నను లద్దె(కత్తెర) పురుగు ఆశిస్తుంది. ఇది తిరగబడిన వై ఆకారాంలో తెల్లని చారలు కలిగి ఉంటుంది. ఉదర భాగంలో నల్లటి నాలుగు చుక్కలు చతురుస్ర ఆకారంలో ఉంటుంది. ఈ విధంగా వీటిని గుర్తించవచ్చు. వీటి లార్వాలు పంట ఆకు, కాండను తింటాయి. మొదటి దశలో ఆకు పత్రహరితాన్ని పూర్తిగా తింటాయి. ఆకులు తిన్న అనంతరం కాండం తింటూ పూర్తిగా మొక్క లేకుండా చేస్తాయి. అందువలన వీటిని గుర్తించిన వెంటనే లార్వాను ఏరివేసి నాశనం చేయాలి. పురుగు, గుడ్ల సముదాయాన్ని గుర్తించి వెంటనే వేప సంబంధిత మందులు వాడుకోవాలి. ఉద్ధృతి తక్కువగా ఉన్నప్పుడు క్లోరి ఫైరిఫాస్ 2.5 మిల్లీ లీటర్లు, క్విన్‌లాల్ ఫాస్ 2.0 మిల్లీ లీటర్ల మందు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఎక్కువగా ఉన్నప్పుడు ఎమాక్సిన్ బెంజొయట్ 0.4 గ్రామాలు లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. అలాగే విషపు ఎరలతో కూడా తెగుళ్లను నివారించుకోవచ్చు.
మొక్కజొన్నపై మక్కువ..!
మొక్కజొన్నపై మక్కువ..!


