‘మూమెంట్’ ఇవ్వరా..?
అరసవల్లి: వైద్యారోగ్య శాఖలో ఇటీవల పదోన్నతులు పొందిన వారికి మూమెంట్ ఆర్డర్లు కోసం స్థానిక వైద్యారోగ్య శాఖాధికారులు ముప్పతిప్పలు పెడుతున్నారని పలువురు మహిళా ఉద్యోగినులు ఆరోపిస్తున్నారు. వైద్యారోగ్య శాఖలో హెల్త్ సూపర్‌వైజర్లుగా పనిచేసిన వారికి పబ్లిక్ హెల్త్ నర్సులుగా పదోన్నతులు కల్పిస్తూ విశాఖపట్నం రీజనల్ డైరక్టర్ కార్యాలయం వద్ద ఈనెల 9న కౌన్సెలింగ్ ప్రక్రియను పూర్తి చేశారు. అయితే ఈ మేరకు పదోన్నతులు పొందిన ప్రాంతాల్లో విధుల్లో చేరాలంటే స్థానిక వైద్యారోగ్య శాఖాధికారి నుంచి మూమెంట్ ఆర్డర్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఆదేశాలను తొలుత ఈనెల 10న ఇస్తామని అధికారులు ప్రకటించడంతో పదోన్నతులు పొందిన సుమారు 11 మంది మహిళా ఉద్యోగినులు స్థానిక డీఎంహెచ్‌వో కార్యాలయం వద్ద వేచి చూశారు. ఐదు రోజులుగా ఇలాగే మూమెంట్ ఆర్డర్లు కోసం కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పట్టించుకునే నాథుడే లేడని వారు వాపోతున్నారు. సోమవారం రాత్రి 8 గంటల వరకు కూడా బాధితులు స్థానిక డీఎంహెచ్‌వో కార్యాలయం వద్దే ఉన్నప్పటికీ సంబంధిత విభాగాధిపతులు పట్టించుకోకపోవడంపై వారంతా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి పదోన్నతులు పొందినవారికి మూమెంట్ ఆర్డర్లు జారీ చేయాలని కోరుతున్నారు.


