ప్రావీణ్యం సంపాదించాలి
సారవకోట: నూతన గృహోపకరణాల తయారీలో కార్మికులు మరింత ప్రావీణ్యం సంపాదించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సూచించారు. మండలంలోని బుడితి గ్రామానికి చెందిన కంచు, ఇత్తడి కార్మికులు తయారు చేసిన నూతన గృహోపకరణాలను సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్‌కు అందజేశారు. కంచు, ఇత్తడి కార్మికులకు ఇటీవల లేపాక్షి ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వగా, వారిచ్చిన శిక్షణలో సూచించిన వస్తువులు తయారు చేశారు. లేపాక్షి ద్వారా వాటిని విక్రయించేందుకు తనవంతు కృషి చేయనున్నట్లు కలెక్టర్ హామీ ఇచ్చారు.
అభ్యుదయం సైకిల్ యాత్ర నేడు
శ్రీకాకుళం క్రైమ్: గంజాయి, మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో నగరంలో అభ్యుదయం సైకిల్ యాత్ర మంగళవారం చేపట్టనున్నారు. దీనికి సంబంధించి రూట్ మ్యాప్‌ను పోలీసులు విడుదల చేశారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే ఈ యాత్రలో ప్రజలు, ముఖ్యంగా యువత, విద్యార్థులు అత్యధికంగా పాల్గొనాలని ఎస్పీ మహేశ్వరరెడ్డి పిలుపునిచ్చారు. యాత్ర అనంతరం ఎన్టీఆర్ మున్సిపల్ హైస్కూల్ మైదానంలో భారీ బహిరంగ అవగాహన సభ జరుగుతుందన్నారు.
యాత్ర సాగే మార్గం
సింహద్వారం – ఎర్రంనాయుడు ఆర్చి కూడలి – డే అండ్ నైట్ కూడలి – రామలక్ష్మణ కూడలి – సూర్యమహల్ కూడలి – జీటీ రోడ్డు – ఏడురోడ్ల కూడలి
చోరీలు చేసిన వ్యక్తి అరెస్టు
పొందూరు: మండల కేంద్రంలోని గాంధీనగర్–1, 2 వీధుల్లో వారం రోజుల క్రితం జరిగిన దొంగతనాలకు సంబంధించి దొంగను ఆదివారం రాత్రి పోలీసులు పట్టుకున్నారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం జరజాపుపేటకు చెందిన అవనాపు అప్పలస్వామి పొందూరు బస్టాండ్‌లో ఆదివారం అర్ధరాత్రి అనుమానాస్పదంగా తిరుగుతూ పోలీసులకు చిక్కాడు. పొందూరులో దొంగతనం చేసేందుకు వచ్చినట్లు పోలీసుల విచారణలో తేలిందని, గాంధీనగర్ వీధుల్లో దొంగతనాలు చేసిన వ్యక్తిగా గుర్తించామని ఎస్‌ఐ సత్యనారాయణ పేర్కొన్నారు. దీంతో దొంగతనం చేసిన సొత్తును అప్పలస్వామి నుంచి రికవరీ చేసినట్లు తెలిపారు. ఒక కేసుకు సంబంధించి అరతులం బంగారం, వెండి, రెండో కేసుకు సంబంధించి 30 తులాల వెండి స్వాధీనం చేసుకున్నామన్నారు. పొందూరు కోర్టులో హాజరుపరిచినట్లు వెల్లడించారు.
పంచ్ అదిరింది
శ్రీకాకుళం న్యూకాలనీ: రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీల్లో శ్రీకాకుళం పంచ్ అదిరింది. ఈనెల 13, 14 తేదీల్లో విజయవాడ వేదికగా 9వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి సీనియర్స్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్–2025 పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో శ్రీకాకుళం జిల్లా క్రీడాకారులు ఒక బంగారు, మూడు రజత, మరో మూడు కాంస్య పతకాలతో కలిపి మొత్తం ఏడు పతకాలు సాధించి శభాష్ అనిపించారు. అలాగే రాష్ట్ర ఛాంపియన్‌షిప్ రన్నరప్ టైటిల్‌ను సాధించారు. బంగారు పతకం సాధించిన పి.విశ్వేశ్వరరావు ఆలిండియా సీనియర్స్ నేషనల్ బాక్సింగ్ పోటీలకు ఎంపికయ్యాడు. ఈ పోటీలు ఉత్తరాఖండ్ వేదికగా ఈనెల 31 నుంచి జనవరి 6 వరకు జరగనున్నాయి. ఇదిలా ఉండగా జిల్లా క్రీడాకారుల రాణింపునకు ప్రధాన కారణం డీఎస్‌ఏ బాక్సింగ్ కోచ్ ఎం.ఉమామహేశ్వరరావు అని జిల్లా బాక్సింగ్ సంఘ పెద్దలు కొనియాడారు.
క్రీడాకారులు ఉన్నతమైన రాణింపునకు కోచ్ అందిస్తున్న కఠోర శిక్షణే కారణమని డీఎస్‌డీవో ఎ.మహేష్‌బాబు, జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బలగ అనంతలక్ష్మణ్ దేవ్ (అను), వంగా మహేష్ పేర్కొన్నారు. ఈ టోర్నీకి క్రీడాకారులకు కోచ్ మేనేజర్‌గా వ్యవహరించిన పి.అప్పలరాజు, అసిస్టెంట్ కోచ్ రాజీవ్‌ను అభినందించారు.
ప్రావీణ్యం సంపాదించాలి
ప్రావీణ్యం సంపాదించాలి
ప్రావీణ్యం సంపాదించాలి


