సత్తాచాటిన సిక్కోలు
● రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో పాగా
● జూనియర్స్ బాలబాలికల రెండు
విభాగాల్లోనూ రాణింపు
● నేషనల్ క్యాంప్‌కు ఆరుగురు ఎంపిక
శ్రీకాకుళం న్యూకాలనీ: గ్రామీణ క్రీడల్లో తమకు తిరుగులేదని జిల్లా క్రీడాకారులు మరోసారి నిరూపించారు. కొత్త సీజన్‌లోను శ్రీకాకుళం కబడ్డీ జట్లు సత్తాచాటాయి. పల్నాడు జిల్లా పెదకూరపాడు వేదికగా ఈనెల 10 నుంచి 12వ తేదీ వరకు 51వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి జూనియర్స్ బాలబాలికల కబడ్డీ ఛాంపియన్‌షిప్–2025 పోటీలు జరిగాయి. ఈ ప్రతిష్టాత్మక పోటీల్లో సిక్కోలు జట్లు అదిరే ఆటతీరును కనబర్చి విజయబావుటా ఎగురవేశాయి. ఈ టోర్నీలో శ్రీకాకుళం బాలికల జట్టు రన్నరప్‌గా నిలిచి రజత పతకం సాధించగా, బాలుర జట్టు తృతీయ స్థానంలో నిలిచి కాంస్య పతకంతో రాణించింది. బాలికల జట్టుకు కోచ్, మేనేజర్లుగా వెంకట్రావు, శ్యామ్, బాలురు జట్టుకు కోచ్, మేనేజర్లుగా లోకేష్, చిరంజీవి వ్యవహరించి మెప్పించారు.
జాతీయ పోటీలకు ఆరుగురు ఎంపిక
ఇదిలా ఉండగా ఈ టోర్నమెంట్‌లో అత్యుత్తమ ప్రతిభ చూపిన ఆరుగురు క్రీడాకారులు జాతీయ కబడ్డీ పోటీల్లో ఏపీ ప్రాబబుల్స్ జట్టుకు ఎంపికయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలికల జట్టుకు ఎస్.హర్షిత, పి.హరిణి, పి.యమున ఎంపికవ్వగా, బాలురు జట్టుకు ఎస్.రామ్మోహన్‌రావు, షేక్ రఫీ, ఎన్.అప్పలరాజు ఎంపికయ్యారు. జిల్లా జట్ల రాణింపు, క్రీడాకారులు జాతీయ పోటీలకు ఎంపిక కావడంపై శ్రీకాకుళం జిల్లా కబడ్డీ సంఘం చైర్మన్, ఎమ్మెల్యే గొండు శంకర్, జిల్లా అధ్యక్షుడు నక్క రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి సాదు ముసలినాయుడు, కార్యనిర్వాహక కార్యదర్శి సాదు శ్రీనివాసరావు, కోశాధికారి నాగళ్ల రమేష్, డీఎస్‌డీఓ ఎ.మహేష్‌బాబు, ఒలింపిక్, పీఈటీ సంఘ సభ్యులు, సీనియర్ క్రీడాకారులు హర్షం వ్యక్తం చేశారు.
సత్తాచాటిన సిక్కోలు


