అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు
● కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
● పీజీఆర్‌ఎస్‌కు 79 వినతులు
టెక్కలి: అర్జీల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం చేయద్దని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో పీజీఆర్‌ఎస్‌ను సోమవారం నిర్వహించారు. దీనిలో భాగంగా సుమారు 79 వినతులు స్వీకరించారు. సకాలంలో అర్జీలపై బాధితులకు సరైన సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో జేసీ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్, డీఆర్‌డీఏ పీడీ కిరణ్, టెక్కలి ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
● ఇటీవల పలాసలోని ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో తన అత్త తోపల అంకమ్మ తీవ్రంగా గాయపడి ప్రస్తుతం ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని, ఆమెకు ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.50 వేల సాయాన్ని ఇప్పటివరకు ఇవ్వలేదని అల్లుడు కొత్తపల్లి ఎర్రయ్య ఫిర్యాదు చేశారు.
● టెక్కలి మండలంలోని పలువురు మిల్లర్లు ధాన్యం కొనుగోలు విషయంలో బస్తాకు అదనంగా ధాన్యం డిమాండ్ చేస్తున్నారని రైతులు ఫిర్యాదు చేశారు.
● టెక్కలి మండలంలోని తేలినీలాపురం గ్రామంలో తమకు చెందిన భూమికి మరొకరి పేరున ఆన్‌లైన్‌లో పత్రాలు చూపిస్తోందని, దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని రోణంకి రాజు ఆవేదన వ్యక్తం చేశారు.
● కోటబొమ్మాళి మండలం పెద్దబమ్మిడి గ్రామంలో గ్రామ పంచాయతీకి చెందిన చెరువును కొంతమంది ఆక్రమించుకుంటున్నారని, దీనిపై గతంలో మండల స్థాయి అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆయా గ్రామానికి చెందిన పలువురు రైతులు ఫిర్యాదు చేశారు.
● తన తండ్రి బసవల సింహాచలం నందిగాం మండలంలోని పశు సంవర్ధక శాఖలో జేవీఓగా పనిచేసి మరణించారని, ఆ కోటాలో తనకు ఉద్యోగాన్ని ఇప్పించాలని కుమార్తె రేవతి విన్నవించారు.
వెలవెలబోయిన జిల్లా పరిషత్
శ్రీకాకుళం పాతబస్టాండ్: నగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో సోమవారం జిల్లా రిటైర్ రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వరరావు, ఎస్‌డీసీ పద్మావతిలు పీజీఆర్‌ఎస్‌ను నిర్వహించారు. అయితే ఉన్నతాధికారులు టెక్కలిలో నిర్వహించిన డివిజనల్ పీజీఆర్‌ఎస్‌లో పాల్గొనడంతో జిల్లా కేంద్రంలోని గ్రీవెన్సు వెలవెలబోయింది. కార్యక్రమంలో అందరూ ద్వితీయ, కింది స్థాయి అధికారులే పాల్గొన్నారు.


