సమస్యలు పరిష్కరించాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: తమ సమస్యలు పరిష్కరించాలని సమగ్ర శిక్ష పరిధిలో జిల్లాలో పనిచేస్తున్న సీఆర్‌ఎం టీచర్లు కోరారు. ఈ మేరకు కలెక్టరేట్ వద్ద ఆత్మగౌరవ దీక్షను సోమవారం నిర్వహించారు. ముందుగా ఆర్‌అండ్‌బీ బంగ్లా నుంచి కలెక్టరేట్ వరకు భారీ ప్రదర్శనగా చేరుకొని దీక్షను నిర్వహించారు. ఉద్యోగుల పోరాటానికి సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు సంపూర్ణ మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా ఏపీ సీఆర్‌ఎం టీచర్స్ యునైటెడ్ ఫారం శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు పోలాకి తవిటినాయుడు, ప్రధాన కార్యదర్శి బి.గిరిధర్, కోశాధికారి ఎన్.ఢిల్లీశ్వరరావు మాట్లాడుతూ.. స్కూల్ కాంప్లెక్సుల్లో ఏ, బీ క్లస్టర్ ప్రతిపాదిత విధానాన్ని విరమించాలని డిమాండ్ చేశారు. 2016లో పీఏబీ ఆమోదించిన వేతనాలను చెల్లిస్తున్నారని, అయితే పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలను పెంచాలని కోరారు. సీఆర్‌ఎంటీల్లో నెలకొన్న అభద్రతా భావాన్ని తొలగించి, అందరికీ ఒకే విధమైన హోదా, పనిని కల్పించాలన్నారు. ఫీల్డు లెవల్లో పనిచేస్తున్నవారికి అలవెన్సును పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం జిల్లా పరిషత్ గ్రీవెన్స్‌లో డీఆర్‌వోకు యూనియన్ ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు కె.రామకృష్ణ, డి.శ్రీనివాసరావు, టి.ప్రసాదరావు, పి.వైకుంఠరావు, జయలక్ష్మి, అరుంధతి తదితరులు పాల్గొన్నారు.


