హెచ్చరిక బోర్డులు ఏర్పాటు
టెక్కలి: టెక్కలి డివిజన్ కేంద్రంలోని కాటాబందలో అయ్యప్పనగర్‌కు వెళ్లే మార్గంలో ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలపై స్థానికులు సోమవారం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌కు ఫిర్యాదు చేశారు. రోడ్డుకు ఆనుకుని ప్రభుత్వ స్థలంలో అక్రమంగా దుకాణాలు కడుతున్న ప్రయత్నాలను స్థానికులు అడ్డుకోవడంపై ‘ప్రభుత్వ స్థలంలో పాగా’ శీర్షికతో సాక్షి పత్రికలో కథనం వెలువడిన సంగతి తెలిసిందే. ఈ మేరకు సోమవారం టెక్కలి ఆర్డీవో కార్యాలయంలో కలెక్టర్ నేతృత్వంలో నిర్వహించిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో అయ్యప్పనగర్ వాసులంతా ఫిర్యాదు చేశారు. తమ కాలనీకు వెళ్లేందుకు ఉన్నటువంటి రోడ్డుకు ఆనుకుని ప్రభుత్వ స్థలంలో చేపడుతున్న అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో కలెక్టర్ స్పందించి తక్షణమే ఆయా అక్రమ నిర్మాణాలు ఆపాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో అక్రమ నిర్మాణాల వద్ద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. కాగా ఈ నిర్మాణాలు పూర్తిస్థాయిలో ఆగిపోతాయా లేదా తాత్కాలికంగా ఆగుతాయా అనే చర్చ స్థానికంగా నెలకొంది.
హెచ్చరిక బోర్డులు ఏర్పాటు


