మా డబ్బు ఎప్పుడు చెల్లిస్తారు..?
● ఇచ్ఛాపురం పోస్టాఫీస్ వద్ద బాధిత ఖాతాదారుల నిరసన
● పట్టించుకోని పోస్టల్ ఉన్నతాధికారులు
ఇచ్ఛాపురం: ఇచ్ఛాపురం పోస్టాఫీస్ వద్ద ఖాతాదారులంతా సోమవారం ఆందోళన చేశారు. తాము ఖాతాల్లో దాచుకున్న డబ్బులు ఎప్పుడు ఇస్తారని పోస్టల్ సిబ్బందిని నిలదీశారు. పోస్టాఫీస్ సిబ్బంది కార్యాలయంలోనికి వెళ్లకుండా పోస్టల్ గేట్ వద్ద ఖాతాదారులంతా బైఠాయించి నిరసన తెలియజేశారు. గత ఏడాది ఇచ్ఛాపురం పోస్టాఫీస్ కార్యాల యం ఆధారంగా చేసుకొని పోస్టల్ సిబ్బందే 36 మంది ఖాతాల నుంచి రూ.2.78 కోట్ల భారీ స్కామ్ కి పాల్పడ్డారు. ఈ విషయం ఆలస్యంగా బయటపడింది. దీంతో జూలైనెలలో సంబంధిత ఖాతాదారులను పోస్టాఫీస్ వద్ద విచారించడంతో ఖాతాదారులకు ఈ విషయం తెలిసింది. అప్పటి నుంచి ఖాతా దారులంతా ఆందోళనకు గురవుతున్నారు. పోస్టల్ సూపరింటెండెంట్ హరిబాబు ప్రతి ఒక్కరికీ వడ్డీతో సహా డబ్బు వస్తుందని భరోసా ఇచ్చారు. ఇలా చెప్పి నాలుగు నెలలవుతున్నా ప్రక్రియ ముందుకు కద ల్లేదు. దీంతో ఖాతాదారులంతా కలసి సోమవారం పోస్టల్ కార్యాలయం గేట్ వద్ద నిరసన తెలిపారు. అయినా పోస్టల్ ఉన్నతాధికారులు స్పందించలేదు.


