సున్నావడ్డీ గుర్తుందా..?
శ్రీకాకుళం పాతబస్టాండ్: చంద్రబాబు ప్రభుత్వం సున్నా వడ్డీ మాట మర్చిపోయినట్టుంది. ఎన్నికల సమయంలో మహిళలకు ఆర్థిక భరోసాగా ఏటా రూ.20వేలు ఇస్తామని టీడీపీ నాయకులు హామీ ఇచ్చారు. రెండేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఆ హామీ ఊసే లేదు. 50 ఏళ్లకే పింఛన్ అన్న హామీకి ఎప్పు డో పాతరేశారు. జిల్లాలో వేలాది మంది కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారు. వీటికి తోడు మహిళ స్వయం శక్తి సంఘాలకు కూడా చంద్రబాబు ప్రభుత్వం రిక్త హస్తాలను చూపుతోంది. ఇప్పటికి రెండేళ్లుగా మహిళలు తీసుకున్న బ్యాంకు రుణాలకు వడ్డీని విడుదల చేయాల్సి ఉంది. కానీ ప్రభుత్వం ఆ ఆలోచనే చేయలేదు. దీంతో డ్వాక్రా మహిళలు వడ్డీ భారం మోయలేకపోతున్నారు.
రెండు విడతల బకాయి
చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళా సంఘాలు బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలకు గాను రెండు విడతల్లో సున్నా వడ్డీ రాయితీ ఇవ్వాల్సి ఉంది. కానీ ఈ ప్రభుత్వం పేదలకు, మ హిళలకు ఏ ప్రయోజనం చేకూర్చడం లేదు. సూపర్ సిక్స్ విజయవంతం అంటూ బాకాలు ఊదుకోవడం తప్ప జనాలకు ఒరిగిందేమీ లేదు. 2023– 24 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 29,544 సంఘాలకు గాను రూ.2,200.26 కోట్ల రుణా లను బ్యాంకు ద్వారా అందించారు. వీటికి గాను సున్నావడ్డీ రాయితీ రూ.52.34 కోట్లు ఇవ్వాల్సి ఉంది. అలాగే 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 19,307 సంఘాలకు గాను రూ.1528.38 కోట్ల రుణాలు అందజేశారు. వీటికి గాను రూ.39. 25 లు విడుదల చేయాల్సి ఉంది. కానీ ప్రభుత్వం అసలు వీటి జోలికే వెళ్లడం లేదు. దీంతో సంఘాలు ఆర్థిక భారంతో కునారిల్లుతున్నాయి.
వైఎస్ జగన్ హయాంలో..
2019 ఎన్నికల ముందు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో అక్కా చెల్లెమ్మలు పడుతున్న కష్టాలను తెలుసుకొని మహిళా స్వయం శక్తి సంఘాల బ్యాంకు ద్వారా పొందిన రుణాలపై వడ్డీ తిరిగి చెల్లిస్తామని మాటిచ్చారు. అది తూచా తప్పకుండా పాటించారు. వరుసగా నాలుగు విడతల్లో మహిళా సంఘాలకు వారు చెల్లించిన వడ్డీని తిరిగి వారి బ్యాంకు ఖాతాలకు జమ చేసి మాట నిలబెట్టుకున్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ–వెలుగు, మెప్మా ఆధ్వర్యంలో నడుస్తున్న 40,595 స్వయం సహాయక సంఘాలలో 4,57,913 మంది సభ్యులకు తొలి ఏడాది రూ.36.29 కోట్లు, రెండో ఏడాది రూ.35.65 కోట్లు, మూడో విడతలో రూ.39.30 కోట్లు, నాలుగో విడతలో రూ.49.30 కోట్లు సున్నావడ్డీ రాయితీని అందజేశారు.
సున్నావడ్డీ మాటే మర్చిపోయిన
చంద్రబాబు ప్రభుత్వం
గత ప్రభుత్వంలో ఏటా మహిళా సంఘాలకు వడ్డీ జమ
వడ్డీ భారం మోయలేక సతమతమవుతున్న మహిళలు


