ముహూర్తాలకు విరామం
● ఫిబ్రవరి 17 వరకు శుక్ర మౌఢ్యమి
● వివాహ అనుబంధ రంగాలపై ఆర్థిక ప్రభావం
మౌఢ్యమిలో శుభ కార్యాలు వద్దు
ఏ శుభకార్యం తలపెట్టినా గురు, శుక్ర గ్రహాలు బలంగా ఉండాలి. సూర్యుడి స్థానాలను బట్టి గురు, శుక్ర మూఢాలు ఉంటాయి. ఫిబ్రవరి 17 వరకు అంటే దాదాపు మూడు నెలలు పాటు ముహూర్తాలు ఉండవు. – నారాయణపాడి,
పురోహితుడు, ఇచ్ఛాపురం మండలం
ఇచ్ఛాపురం రూరల్: శుభ కార్యాలకు దాదాపు మూడు మాసాలు విరామం వచ్చింది. నవంబర్ 27 నుంచి ఫిబ్రవరి 17 వరకు శుక్ర మౌఢ్యం వల్ల పెళ్లిళ్లు తదితర శుభ కార్యాలకు విరామం ఏర్పడుతోంది. మార్గశిర, మాఘ, ఫాల్గుణ మాసాల్లో శుభకార్యాలు అధికంగా జరుగుతాయి. ఈ సారి మార్గశిరంలో ఒకటి రెండు ముహూర్తాలు ఉండగా, పుష్య మాసం శూన్యమాసం కావడంతో మాఘంలోనూ ఒక్క ముహూర్తం లేకపోవడం గమనార్హం. గృహ ప్రవేశాలకు అనుకూలమైన రథసప్తమి, సరస్వతి జన్మదినమైన వసంత పంచమి, మహామాఘగా పిలిచే మాఘ పౌర్ణమి వంటి తిథులు ఈ సారి మూఢంతో కలిసిపోయాయి.
వివాహ అనుబంధ రంగాలపై ప్రభావం
శుభ కార్యాలు లేకపోతే దానికి అనుబంధంగా ఉండే అనేక రంగాలు కుదేలవుతాయి. వివాహ మండపాలు, ఫంక్షన్ హాళ్లు, వస్త్ర వ్యాపారాలు, బంగారు దుకాణాలు, స్వర్ణకారులు, క్యాటరింగ్, ఫొటో వీడి యో గ్రాఫర్లు, పూల దుకాణాలు, లైటింగ్, డీజేలు, అద్దె వాహనాలు, బాజాభజంత్రీలు ఇలా వివాహ అనుబంధ రంగాలపై ఆధారపడి బతుకుతున్న వందలాది కుటుంబాలు నెలలు కొద్దీ నష్టపోవాల్సి వస్తోంది. ఇక పౌరోహిత్యమే తమ జీవనోపాధిగా ఉన్న బ్రాహ్మణులు ఈ మూడు నెలలు కాలం గడ్డు పరిస్థితులు అనుభవించాల్సి వస్తోంది.
ముహూర్తాలకు విరామం


