రేపే కోటి సంతకాల ర్యాలీ
అందరూ తరలివచ్చి విజయవంతం చేయండి విలేకరులతో వైఎస్సార్ సీపీ సీనియర్ నేతలు కుంభా రవిబాబు, ధర్మాన కృష్ణదాస్ చంద్రబాబు పాలన తీరుపై ధ్వజం
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ):
రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపుమేరకు చేపట్టిన కోటి సంతకాల సేకరణ ఉద్యమానికి అంచనాలకు మించి స్పందన వచ్చిందని వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పరిశీలకుడు, ఎమ్మెల్సీ కుంభా రవిబాబు అన్నారు. జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల వ్యాప్తంగా సేకరించిన కోటి సంతకాల ప్రతులు ప్రత్యేక వాహనంలో జిల్లా కేంద్రం నుంచి కేంద్ర పార్టీ కార్యాలయానికి వెళ్లనున్నాయని, ఈ నెల 15న జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ మేరకు టౌన్‌హాలులోని పార్టీ నగర కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌తో కలిసి శనివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రవిబాబు మాట్లాడుతూ సోమవారం ఉదయం 10 గంటలకు శ్రీకాకుళం టౌన్‌హాల్ వద్దకు జిల్లాలోని పార్టీ నాయకులు, శ్రేణులు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు.
చంద్రబాబునాయుడు 40 ఏళ్ల అనుభవంలో ఒక్క మెడికల్‌కాలేజీౖకైనా శ్రీకారం చుట్టారా? అని రవిబా బు ప్రశ్నించారు. వైఎస్సార్‌సీపీ ఐదేళ్ల పాలనలో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తీసుకొచ్చిన ఘనత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందన్నారు. చంద్రబాబు ఎప్పుడూ ప్రభుత్వ రంగ వ్యవస్థలను ప్రైవేటుపరం చేయాలనే చూస్తుంటారని, ఇప్పటికి 53 ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటుపరం చేశారన్నారు. పేదల ఆరోగ్యమన్నా.. పేదోడికి వైద్యమన్నా చంద్రబాబుకు ఎందుకంత నిర్లక్ష్యమో అర్ధం కావడం లేదన్నారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటీ కరణ చేసి రెండేళ్లపాటు జీతభత్యాలు ఇస్తామనడం ఆశ్చర్యానికి గురిచేస్తోందన్నారు. ఆదాయం ప్రైవేటుకు, ఖర్చులు ప్రభుత్వానికా అని ప్రశ్నించారు. ఏడాదిన్నర పాలనలో రూ.2.66లక్షల కోట్లు అప్పు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. అమరావతి రాజధానికిరూ. లక్ష కోట్లు ఖర్చుచేయడం అవసరమా అని ప్రశ్నించారు.
పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో విద్య, వైద్య రంగాల్ని చంద్రబాబు సర్వనాశనం చేశారని మండిపడ్డారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేఖిస్తూ చేపట్టిన కోటి సంతకాల సేకరణ విజయవంతంగా పూర్తిచేసేందుకు సహకరించిన జిల్లా ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ 15న ఉదయం 10గంటలకు శ్రీకాకుళం నగరంలో టౌన్‌హాల్ వద్ద నిర్వహించే సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ నెల 18న కోటి సంతకాల ప్రతులతో గవర్నర్‌ను కలవనున్నట్లు తెలిపారు. పార్టీ ముఖ్య నాయకులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.
సమావేశంలో వైఎస్సార్‌సీపీ యువనేత ధర్మాన రామ్‌మనోహర్‌నాయుడు, తూర్పుకాపు కుల బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మామిడి శ్రీకాంత్, కళింగవైశ్యకుల బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు అంధవరపు సూరిబాబు, కార్యవర్గ సభ్యులు చల్ల శ్రీనివాసరావు, గొండు కృష్ణమూర్తి, డాక్టర్స్ సెల్ జిల్లా అధ్యక్షుడు చింతాడ వరుణ్, సంయుక్త కార్యదర్శి ఎన్ని ధనుంజయరావు, శ్రీకాకుళం నియోజకవర్గ పరిశీలకుడు కరిమి రాజేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి గేదెల పురుషోత్తం, బీసీ విభాగం నగర అధ్యక్షుడు గద్దిబోయిన కృష్ణయాదవ్ తదితరులు పాల్గొన్నారు.
రేపే కోటి సంతకాల ర్యాలీ


