రోడ్ల పనులు వేగవంతం చేయాలి
శ్రీకాకుళం పాతబస్డాండ్ : సంక్రాంతి పండగ నాటికి జిల్లాలోని రహదారులన్నింటినీ గుంతలు లేని రోడ్లుగా మార్చాలని, మంజూరైన పనులన్నింటినీ త్వరితగతిన పూర్తి చేయాలని రోడ్లు, భవనాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. శనివారం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌తో కలిసి శ్రీకాకుళం ఆర్‌అండ్‌బీ అధికారులతో కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో రూ.82 కోట్ల విలువైన 28 పనులు మంజూరయ్యాయని, నాణ్యతా ప్రమాణాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. నాణ్యతను పరిశీలించిన తర్వాతే ప్రతినెలా బిల్లులు మంజూరు చేస్తామన్నారు. ముఖ్యంగా నీరు నిలిచే సమస్య ఉన్న రోడ్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. సమీకృత కలెక్టరేట్ కార్యాలయ నిర్మాణాన్ని పరిశీలించిన ఆయన ఆ పనులను కూడా వేగవంతం చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ పి.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


