విద్యార్థులు రోబోలు కాదు
● ప్రభుత్వం తీరుపై ఉపాధ్యాయుల మండిపాటు ● డీఈఓ కార్యాలయం వద్ద యూటీఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా
శ్రీకాకుళం:
విద్యార్థులు రోబోలు కారని, కమిషనర్ అనాలోచిత విధానాల వల్ల విద్యాశాఖ అధోగతి పాలవుతోందని పలువురు యూటీఎఫ్ ప్రతినిధులు ధ్వజమెత్తారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం వద్ద బుధవారం యూటీఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి బమ్మిడి శ్రీరామ్మూర్తి మాట్లాడుతూ విద్యార్థులు తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నారని చెప్పారు. టెట్ నుంచి సీనియర్ ఉపాధ్యాయులను మినహాయించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ తక్షణమే దాఖలు చేయాలన్నారు. జిల్లా సహాధ్యక్షులు ధనలక్ష్మి మాట్లాడుతూ 2010కి ముందు అపాయింట్ అయిన ఉపాధ్యాయులను టెట్ నుంచి మినహాయించాలని కోరారు. జిల్లా సహాధ్యక్షుడు ఉమాశంకర్ మాట్లాడుతూ విద్యాశాఖ వైఫల్యానికి కమిషనరే బాధ్యత వహించాలని కోరారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చౌదరి రవీంద్ర మాట్లాడుతూ సింగిల్ టీచర్లకు సెలవుల విషయంలో ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి గొంటి గిరిధర్ మాట్లాడుతూ విద్యార్థులను ఉదయం 8 నుంచి సాయంత్రం 5 వరకు పూర్తిగా పాఠశాలలోనే ఉంచి తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర కౌన్సిలర్ పొందూరు అప్పారావు మాట్లాడుతూ తక్షణమే వంద రోజుల ప్రణాళిక నుంచి రెండో శనివారం, ఆదివారాలు మినహాయింపు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా కోశాధికారి పి.సూర్యప్రకాష్, జిల్లా కార్యదర్శులు హనుమంతు అన్నాజీరావు, బి.రవికుమార్, స్వర్ణ కుమారి, రాష్ట్ర కౌన్సిలర్ దమయంతి, జిల్లా ఆడిట్ కమిటీ కన్వీనర్ గౌరీశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


