కదం తొక్కిన అంగన్‌వాడీలు
(ఇన్‌సెట్లో) డిమాండ్లు చూపిస్తున్న సిబ్బంది
● కలెక్టరేట్ వద్ద ధర్నా చేసిన అంగన్‌వాడీ కార్యకర్తలు
● పోలీసులు, కార్యకర్తల మధ్య తోపులాట
శ్రీకాకుళం పాతబస్టాండ్: జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం కలెక్టరేట్ వద్ద అంగన్‌వాడీ వర్కర్స్–హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ధర్నా నిర్వహించారు. ముందుగా ఆర్‌అండ్‌బీ బంగ్లా జంక్షన్ నుంచి ప్రదర్శన నిర్వహించారు. ధర్నా సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్ష, ప్రధా న కార్యదర్శులు సీహెచ్ అమ్మన్నాయుడు, పి.తేజేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షులు కె.నాగమణి, ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్–హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కె.కల్యాణి, సుధ పలు డిమాండ్లు వినిపించారు. అంగన్‌వాడీలకు కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా మెనూ చార్జీలు పెంచాలని, పెరిగిన వేతనాలను ఇవ్వాలని కోరారు. మిగిలిన మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని డిమాండ్ చేశారు. ప్రాథమిక పాఠశాలల్లో అంగన్‌వాడీ సెంటర్లను విలీనం చేయాలనే ప్రభుత్వ నిర్ణయం అంగన్‌వాడీ సెంటర్లకు నష్టం చేస్తుందని అన్నారు. ఎన్నికల ప్రచారాల్లో టీడీపీ అనేక హామీలు ఇచ్చిందని, కానీ అధికారంలోకి వచ్చాక ఏమీ చేయడం లేదన్నారు.
తోపులాట
అంగన్‌వాడీలంతా కలెక్టర్ కార్యాలయం లోపలకు వెళ్లడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తోపులాట జరిగి కార్యకర్తలు కింద పడిపోయారు. అంతలో ఐసీడీఎస్ జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ ఐ.విమల వచ్చి సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ధర్నాలో సీఐటీయూ జిల్లా నాయకులు అల్లు సత్యనారాయణ, ఎన్‌వీ రమణ, ఆర్.ప్రకాశరావు, బి.మురళి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి.సింహాచలం, అంగన్‌వాడీ సిబ్బంది పాల్గొన్నారు.
ఆందోళన చేస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలు
కదం తొక్కిన అంగన్‌వాడీలు


