ఆశలు సమాధి చేస్తూ..!
● రబీ పంటకు సాగునీరు ఇవ్వలేమని
మంత్రి అచ్చెన్న ప్రకటన
● భగ్గుమంటున్న జిల్లా రైతులు
జలుమూరు: ఈ ఏడాది రబీలో సాగుకు సిద్ధమవుతున్న రైతులకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు షాక్ ఇచ్చారు. రబీకి సాగునీరు ఇవ్వలేమని ఆయన ప్రకటించడంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి గడిచిన నెల రోజులుగా రబీ పంటలకు రైతులు సమాయత్తం అవుతున్నారు. దీనిలో భాగంగా వరికి సంబంధించి ఇప్పటికే కొంతమంది నాట్లు, వరి వెదలు వేయగా.. మరి కొంతమంది రైతులు వరినారు కూడా పోశారు. ఇతర పంటలు వేయకున్నా ఆయా పంట పొలాలను ఇప్పటికే సిద్ధం చేశారు. జిల్లావ్యాప్తంగా రబీకి సంబంధించి వరి సుమారు 48 వేల హెక్టార్లలో.. ఇతర పంటలు పంటలు 70.32 వేల ఎకరాల్లో సాగు చేయనున్నట్లు అంచనా.
మండిపడుతున్న రైతులు
రబీసాగుకు నీరు ఇవ్వలేమని మంత్రి ప్రకటించడంపై జిల్లా రైతులు మండిపడుతున్నారు. వేలాది రూపాయల పెట్టుబడులు పెట్టి నారుమడులు, వెదలు, నాట్లు, మొదటి ఎరువు సైతం వేశారు. ఈ నేపథ్యంలో సాగుకు నీరు ఇవ్వలేమని మంత్రి చెప్పడంతో ఆందోళన చెందుతున్నారు. వంశధార కుడి, ఎడమ కాలువల పరిధిలో కొత్తూరు, ఎల్‌ఎన్‌పేట, హిరమండలం, ఆమదాలవలస, జలుమూరు, సారవకోట, నరసన్నపేట, పోలాకి, కోటబొమ్మాళి, సంతబొమ్మాళి, టెక్కలి తదితర మండలాల్లో అత్యధికంగా వరి రెండో పంటగా సాగు చేస్తున్నారు. ఇదే సమయంలో వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టిన రైతులు తమ పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు. కూటమి ప్రభుత్వంలో ఈ ఏడాది రైతులు విత్తనాలు, ఎరువులు, ధాన్యం అమ్మకాలకు అనేక ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు సాగునీరుకు కూడా అవస్థలేనని వాపోతున్నారు.
ముందే ఎందుకు చెప్పలేదు
ఈ ఏడాది రబీ వరికి నీరు అందించలేమని అటు ప్రజాప్రతినిధులు, ఇటు అధికారులైనా కనీసం ముందే ప్రకటన చేయాల్సింది. నెల రోజుల నుంచి వరికి సంబంధించి నాట్లు, వెదలు, నారుపోత, దుమ్ము, దుక్కి తదితర పను లు చేపట్టాము. ఇప్పటికే అప్పలు తీసుకొచ్చి పెట్టు బడులు పెట్టడం జరిగింది. చివరికి ఈ సమయంలో సాగునీరు అందించలేమని చెప్పడం సరికాదు. – చింతు సూర్యనారాయణ, కరవంజ, జలుమూరు
రైతుపై ఇంత చిన్నచూపా
కూటమి ప్రభుత్వానికి రైతుపై ఇంత చిన్నచూపు తగదు. రైతు బాగుంటేనే అంతా బాగుంటారు. రైతులను ఇబ్బందులకు గురిచేసినవారు బాగుపడరు. ఇంత ఇబ్బందులు పెట్టడం మంచిది కాదు. మేము ఆల్రెడీ పెట్టుబడులు పెట్టాము. ఇప్పుడు సాగునీరు ఇవ్వడం కుదరదు అంటే నష్ట పరిహారం అందజేయాలి.
– బండి కృష్ణారావు, హుస్సేనుపురం, జలుమూరు
ఆశలు సమాధి చేస్తూ..!
ఆశలు సమాధి చేస్తూ..!


