తాళం వేసిన ఇళ్లే టార్గెట్
● బూర్జ చోరీ కేసును ఛేదించిన పోలీసులు ● ఐదుగురు నిందితులు అరెస్టు ● భారీగా ఆభరణాలు, నగదు స్వాధీనం
శ్రీకాకుళం : బూర్జ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ నెల 1న జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. బుధవారం మధ్యాహ్నం కేసు వివరాలను డీఎస్పీ వివేకానంద తన కార్యాలయంలో విలేకరులకు వెల్లడించారు. బూర్జకు చెందిన చెన్నూరు రమేష్ కుటుంబంతో కలిసి గత నెల 30న క్యాంపు వెళ్లారు. ఇంటికి తాళం వేసి ఉన్న విషయాన్ని గమనించిన దుండగులు ఒకటో తేదీ అర్ధరాత్రి ఇంటి తాళం పగలగొట్టి నగలు, నగదు అపహరించారు. రమేష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అక్కడ లభించిన ఆధారాల మేరకు కోనసీమ జిల్లా ముమ్మిడివరం గ్రామానికి చెందిన ఉండ్రు నాగరాజు, విశాఖపట్నం జిల్లా గంగవరం గ్రామానికి చెందిన చాపల ఆనంద్, అనకాపల్లి
జిల్లా మాటూరు గ్రామానికి చెందిన మాటూరు శ్రీను, కోనసీమ జిల్లా చింతలచెరువుకు చెందిన మద్దెల చంటి, బీహార్ రాష్ట్రం హజ్జపూర్‌కు చెందిన శుభం మిశ్రా ఈ దొంగతనం చేసినట్లు గుర్తించారు. వీరందరిపైనా గతంలో కూడా పలు కేసులు నమోదయ్యాయని డీఎస్పీ తెలిపారు. నాగరాజుపై 24, చాపల ఆనందపై 24, మాటూరు శ్రీనివాస్‌పై 2, మద్దెల చిట్టిబాబుపై 8, శుభం మిశ్రాపై ఒక కేసు ఉందని వివరించారు. నిందితులంతా విశాఖపట్నంలో ఉన్నట్లు గుర్తించి అరెస్టు చేశామన్నారు. వీరి నుంచి రూ.27 లక్షల 30 వేలు విలువైన 210 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.1,41,000 విలువైన వెండి వస్తువులు, రూ.83,700 నగదు స్వాధీనం చేసుకున్నామని వివరించారు. తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా వీరు నేరాలు చేస్తుంటారని చెప్పారు. సమావేశంలో ఆమదాలవలస సీఐ సత్యనారాయణ, బూర్జ ఎస్సై ప్రవళ్లిక, ఆమదాలవలస ఎస్సై బాలరాజు, హెచ్‌సీ రాజు, కానిస్టేబుళ్లు రాధాకృష్ణ, రామకృష్ణ, రమేష్ కుమార్, సురేష్, రామకృష్ణ, ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు
తాళం వేసిన ఇళ్లే టార్గెట్


