ప్రభుత్వానికి రైతుల ఉసురు తగులుతుంది
● సీపీఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ ● కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఖరీఫ్ సీజన్‌లో 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని, గోనె సంచులు అందుబాటులో ఉంచుతామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఆచరణలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని, గిట్టుబాటు ధర కల్పించకపోతే రైతుల ఉసురు ప్రభుత్వానికి తప్పక తగులుతుందని సీపీఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ హెచ్చరించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయం వద్ద రైతు సమస్యలపై నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తేమ శాతం, ధాన్యం రంగు మారిందని, ఇతర కారణాలు చూపుతూ ధాన్యం కొనుగోలు చేయకుండా కొర్రీలు పెట్టడం దారుణమన్నారు. కనీసం పంటను ఆరబెట్టుకోవడానికి టార్పాలిన్లు ఇవ్వకపోవడం అన్యాయమన్నారు. కొనుగోలు కేంద్రం, రైతు సేవ కేంద్రం, రవాణా ఇన్‌చార్జిలు, కస్టోడియన్ ఆఫీసర్లు, రైస్ మిల్లర్లతో కుమ్మకై ్క ధాన్యం దళారులకు అమ్ముకునే విధంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. బస్తాకు రూ.400 నుంచి 500 వరకు రైతులు నష్టపోతున్నారని తెలిపారు. ధాన్యంతో పాటు పత్తి కొనుగోలు విషయంలోనూ యాప్‌ల పేరుతో ఇబ్బందులు పెడుతున్నారని విమర్శించారు. వ్యవసాయ, ఉద్యానవన పంటలతోపాటు ఆక్వా రైతులు పరిస్థితి కూడా దయనీయంగా మారిందన్నారు. భూమిలేని ప్రతి కౌలురైతుకు అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.20 వేలు అందజేస్తామని హామీ ఇచ్చినా అమలు చేయలేదన్నారు. మోంథా తుఫాన్ వల్ల రూ.5500 కోట్లకు పైగా నష్టం జరిగితే ప్రభుత్వం మాత్రం రూ.1000 కోట్ల మేర రైతులకు నష్టం జరిగినట్టు చూపించారని దుయ్యబట్టారు. ఎన్యూమరేషన్ పూర్తి చేసి నెల రోజులైనా నష్ట పరిహారం అందించలేదన్నారు. ఉచిత పంటల బీమా పథకం ఎత్తివేయడంతో ప్రీమియం కట్టలేక రైతులు నష్టపోయారని చెప్పారు. నిరసన కార్యక్రమంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి లండ వెంకటరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు కొన్న శ్రీనివాస్, సంతోష్, హరికృష్ణ, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు కె.సాయికుమార్, పార్టీ నాయకులు అన్నాజీ, భాస్కరరావు, వసంతరావు, గణేష్, కూర్మారావు తదితరులు పాల్గొన్నారు.


