పరిహాసమా!
ఏఓ తీరుపై అభ్యంతరం..
పరిహారమా..
● కేలీ విత్తనాలతో నష్టపోయిన సోంపేట, కంచిలి మండలాల రైతులు ●నష్ట పరిహారం అందించడంలో విత్తన కంపెనీ దోబూచులాట ●ఏఓ మధ్య వర్తిత్వంతో మరింత జఠిలం
శ్రీకాకుళం పాతబస్టాండ్ : చంద్రబాబు ప్రభుత్వంలో అన్నదాతలకు అవస్థలు తప్పడం లేదు. ఖరీఫ్ ప్రారంభం నుంచే కష్టాలు వెంటాడుతున్నాయి. ప్రభుత్వంపై నమ్మకంతో వారు ఇచ్చిన విత్తనాలు చల్లితే చాలాచోట్ల కేలీలు రావడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. జిల్లాలోని కంచిలి, సోంపేట మండలాల్లో ఈ సమస్య ఇటీవల వెలుగుచూసిన విషయం తెలిసిందే. ఆరుగాలం శ్రమించి పంట పండిస్తే చివరికి కేలీలు రావడంతో అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. తమకు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేస్తున్నారు.
జాప్యమెందుకో?
కేలీ వరి విత్తనాలతో మోసపోయిన రైతులకు నష్ట సరిహారం అందజేయడంలో విత్తన కంపెనీల ప్రతినిధులు, వ్యవసాయాధికారులు దోబూచులాడుతున్నారు. న్యాయంగా అందజేయాల్సిన పరిహారం ఇవ్వకుండా దాటవేత ధోరణి అవలంబిస్తున్నారు. ఇప్పటికే కేలీ విత్తనాలు సరఫరా చేసిన కంపెనీపై చర్యలు తీసుకోవాలని సోంపేట, కంచిలి మండలాలకు చెందిన పలువురు రైతులు గత వారం పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదుచేశారు. దీనిపై కలెక్టర్ ఆదేశాల మేరకు విత్తన కంపెనీ ప్రతినిధులు, సోంపేట మండల వ్యవసాయ అధికారి, రైతులతో నాలుగు రోజుల కిందట చర్యలు జరిపారు. రెండు మండలాల్లో సుమారుగా 200 బ్యాగులు ఆర్‌జీఎల్ 2537 రకం విత్తనాలు పంపిణీ చేసినట్టు అధికారులు గుర్తించారు. ఈ విత్తనాలు సుమారు రెండు వేల ఎకరాల్లో పంట వేసినట్టు నిర్ధారించారు. కేలీ విత్తనాలు వల్ల ప్రతి ఎకరాకు సుమారుగా 10 క్వింటాళ్ల ధాన్యం నష్టం వచ్చినట్టు వెల్లడించారు. దీని ప్రకారం ఎకరాకు 10 క్వింటాళ్ల వంతున ప్రస్తుత ధర ప్రకారం రూ.17500 నష్టపరిహారం విత్తన కంపెనీ అందజేయాలని రైతులు బీన ఢిల్లీరావు తదితరులు కోరారు. అయితే కంపెనీ ప్రతినిధులు మాత్రం ఎకరాకు రూ.2500 మాత్రమే ఇస్తామని చెప్పడంతో రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో సమావేశం అర్ధాంతరంగా ముగిసింది. ఇదిలా ఉండగా, ఫౌండేషన్ సీడ్ ఇస్తామని కంపెనీ ప్రతినిధులు మాయమాటలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తుందని రైతులు ఆరోపిస్తున్నారు.
రైతులకు, విత్తన కంపెనీ ప్రతినిధులకు సంధానకర్తగా ఉన్న సోంపేట మండల వ్యవసాయాధికారి ఈ సమస్యను మరింత జఠిలం చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన ప్రయోజనం తప్ప రైతుల ప్రయోజనాలు చూడటం లేదని వాపోతున్నారు. చర్చల ద్వారా న్యాయం జరగకపోతే న్యాయస్థానం ద్వారానైనా పరిహారం హక్కును పొందుతామని స్పష్టం చేస్తున్నారు. దీనికి విత్తన కంపెనీతోపాటు వ్యవసాయ అధికారులు బాధ్యులవుతారని, రైతుల కోసం మరో ఉద్యమం తప్పదని హెచ్చరిస్తున్నారు.
పరిహాసమా!


