మొదలైన పీజీ మూడో సెమిస్టర్ పరీక్షలు
ఎచ్చెర్ల: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ, అనుబంధ కళాశాలల్లోని ఆర్ట్స్, సైన్స్ పీజీ కోర్సులకు చెందిన మూడో సెమిస్టర్ పరీక్షలు క్యాంపస్ కేంద్రంగా మంగళవారం ప్రారంభమయ్యాయి. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈనెల 17వ తేదీ వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. స్కిల్ డవలప్‌మెంట్ సబ్జెక్టుకు ఆర్ట్స్ కోర్సులకు సంబంధించి 319 మందికి గాను 17 మంది గైర్హాజరయ్యారు. అదేవిధంగా సైన్స్ కోర్సులకు సంబంధించి 395 మందికి గాను 8 మంది పరీక్ష రాయలేదు. సైన్స్ కోర్సులకు ఆర్‌అండ్ డీన్ డాక్టర్ ఎన్.లోకేశ్వరి, ఆర్ట్స్ కోర్సులకు అసిస్టెంట్ ప్రిన్సిపాల్ డాక్టర్ సీహెచ్ సుబ్రమ్మణ్యంలు పరీక్షల చీఫ్‌లుగా వ్యవహరిస్తున్నారు. ఏపీజే అబ్దుల్ కలాం బ్లాక్‌లో జరిగిన పరీక్షలను వర్సిటీ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ డా.కె.స్వప్నవాహిని పరిశీలించారు. అదేవిధంగా డీపీఈడీ, బీపీఈడీ పరీక్షలు కూడా ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తున్న ఈ పరీక్షలు ఈనెల 12వ తేదీ వరకు కొనసాగుతాయి. తొలిరోజు ఈ పరీక్షలకు 369 మంది హాజరయ్యారు.
ఆదిత్యలో అంతర్జాతీయ సదస్సు
టెక్కలి: సాంకేతిక అప్లికేషన్స్‌పై టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో ఈనెల 10వ తేదీ నుంచి 12వ తేదీ వరకు మూడు రోజుల పాటు అంతర్జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు కళాశాల డైరక్టర్ వి.వి.నాగేశ్వరరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, ఇంటెలిజెంట్ సిస్టమ్స్, టెక్ ఇన్నోవేషన్ తదితర విభాగాల్లో తాజాగా జరుగుతున్న పరిణామాలపై ఈ సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు. సాంకేతిక రంగంలో పరిశోధనలు, విద్యార్థుల సృజనాత్మకత పెంపొందించేందుకు ఈ సదస్సు ఉపయోగపడుతుందన్నారు.


