ఈ సంతకం!
ఆ.. ఏముంది.. సంతకమే కదా అనుకుంటే పొరపాటే.
అది ఇప్పటికిప్పుడు ఏం చేయలేకపోవచ్చు.. అది నిరసనకు బలమైన సంకేతం.
గడ్డిపోచలన్నీ కలిసి బలమైన తాడులా మారినట్లు సంతకాల నిరసనలు ఒక బలమైన
ఉద్యమంగా మారితే తట్టుకోవడం ఎవరి తరం కాదు.
సరిగ్గా ఇప్పుడు అదే జరుగుతోంది.
పేదలకు కార్పొరేట్ వైద్యం, పేద విద్యార్థులకు వైద్య విద్య ప్రభుత్వ ఖర్చుతో అందించాలన్న సత్సంకల్పంతో గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తలపెట్టిన 17 వైద్య కళాశాలల ఏర్పాటు యజ్ఞంలో ప్రైవేటీకరణ నీళ్లు పోసిన చంద్రబాబు సర్కారు తీరుపై నిరసన, వ్యతిరేకత సంతకాల రూపంలో వెల్లువెత్తాయి. ప్రజలు స్వచ్ఛందంగా సంతకాలు చేయడమే కాకుండా పోటీ పడి మరికొందరి చేత కూడా సంతకాలు చేయించి కూటమి సర్కారు నిర్ణయాలపై తమ వ్యతిరేకతను స్పష్టంగా ప్రకటించారు. పేదలకు వైద్యం, వైద్య విద్య అందాలన్న లక్ష్యంతో వైఎస్సార్‌సీపీ చేపట్టిన కోటి సంతకాల ఉద్యమానికి జై కొట్టారు.
ఈయన పేరు హంగీర్ బెహరా. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం ఈదుపురానికి చెందిన నేషనల్ వాలంటీర్. ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటుపరం చేయాలన్న ఆలోచన నుంచి చంద్రబాబు బయటకు రావాలని వైఎస్సార్‌సీపీ ఉద్యమ స్ఫూర్తితో సంతకాల సేకరణ ఉద్యమం చేపట్టారు. తానొక్కరే 104 మందితో సంతకాలు చేయించారు. చంద్రబాబు నిర్ణయంతో పేదవారికి వైద్య విద్య అందని ద్రాక్షగా మారే ప్రమాదం ఉందన్నారు. ప్రభుత్వం మరోమారు పునరాలోచించాలని, లేకుండా మూల్యం చెల్లించక తప్పదని అంటున్నారు. ఇలాంటి వారే అనేక మంది జిల్లాలో ముందుకొచ్చారు.
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:
ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జనం స్వచ్ఛందంగా కదిలారు. వైఎస్సార్‌సీపీ స్పూర్తితో స్వచ్ఛందంగా సంతకాలు చేశారు. తమ పిల్లల భవిష్యత్ కోసం ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ ఉద్యమంలో మేము సైతం అంటూ భాగస్వామ్యమయ్యారు. ఇప్పుడా యజ్ఞం పూర్తయింది. ప్రజల నుంచీ పెద్ద ఎత్తున స్పందన, మద్దతు వచ్చింది. జిల్లాలో లక్షలాది మంది సంతకాల ఉద్యమంలో పాల్గొన్నారు.
వెల్లువెత్తిన ప్రజాగ్రహం..
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 17 మెడికల్ కళాశాలలు తీసుకొస్తే కూటమి ప్రభుత్వం ఈ 18 నెలల కాలంలో వాటిని నిర్వీర్యం చేసి, వైద్య విద్యను వ్యాపారంగా చేసుకుని తమకు అనుకూల వ్యక్తుల పరం చేసేందుకు చూస్తోందంటూ ప్రజాగ్రహం పెల్లుబుకింది. ఇవి కేవలం సంతకాలు కాదు కోటి ప్రజల గుండెల నిరసన అంటూ ఆవేదన పెల్లుబుకింది. ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని సంతకాలు చేసి కూటమి ప్రభుత్వం తీరును ఎండగట్టారు. ప్రజా సంఘాలు సైతం ప్రభుత్వం తీరును దయ్యబట్టాయి. జిల్లా కేంద్రం నుంచి మారుమూల పల్లె వరకు ఉద్యమం సాగింది. వైఎస్సార్‌సీపీ నాయకులు గ్రామ గ్రామానికి వెళ్లి విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాన్ని, బడుగు, బలహీన వర్గాల భవిష్యత్‌ను కూటమి ప్రభుత్వం నాశనం చేస్తున్న తీరును వివరించారు. ప్రజలు చైతన్యవంతులై స్వచ్ఛందంగా సంతకాలు చేశారు. రచ్చబండ కార్యక్రమాల్లో పాల్గొని తమ గళాన్ని వినిపించారు. బిడ్డల భవిత కోసం పోరు సాగిస్తున్న వైఎస్సార్‌సీపీ వెంట ఉంటామంటూ ప్రతిజ్ఞ చేశారు. నాయకులు అడిగే లోపు కోటి సంతకాల పత్రాలపై సంతకాలు చేశారు. నియోజకవర్గాల ర్యాలీతో ప్రారంభమైన కోటి సంతకాల సేకరణ ఉద్యమం పల్లె పల్లెకు విస్తరించి ఒక యజ్ఞంలా సాగింది.
ప్రజా సంఘాలు సైతం..
వైఎస్సార్‌సీపీ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తుండటంతో ప్రజా సంఘాలు సైతం రంగంలోకి దిగాయి. సీఐటీయూ, సాహితీ స్రవంతి, శ్రామిక మహిళా, గరిమెళ్ల అధ్యయన వేదిక, ఏపీ మోడల్ స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ తదితర సంఘాలు మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ వద్దు అంటూ శ్రీకాకుళంలోని యూటీఎఫ్ భవన్‌లో సమావేశమై నినదించాయి. దళిత ఆదివాసీ బహుజన మైనారిటీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి ప్రైవేటీకరణను వ్యతిరేకించారు. రచయితలు, జర్నలిస్టులు, వ్యాపార సంఘాల నేతలు, సామాజిక న్యాయ పోరాట సమితి ప్రతినిధులు గళమెత్తారు. చివరికీ టీడీపీలో ఉన్న ఎస్సీ సెల్ నాయకులు కూడా రాజకీయాలకు అతీతంగా మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని తమ వాణి వినిపించారు. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో సీఐటీయూ ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్ ఎంఎస్, ఏపీ ఎస్సీ, ఎస్టీ యూఎస్, కేఎన్‌పీఎస్, ఏపీటీఎఫ్1938, ఎస్సీఎస్టీటీఎఫ్, జన సాహితి, ప్రైవేటు విద్యా సంస్థల సంఘాలు, దళిత ఐక్య వేదిక, సీపీఎస్ యూఎస్, యూటీఎఫ్, పట్టణ పౌర సంక్షేమ తదితర సంఘాల పాల్గొని ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీ విధానంలోకి మార్చడం అంటే ప్రజల హక్కులను కాలరాయడమేనని నినదించాయి.
ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ
వైఎస్సార్ సీపీ ప్రజా ఉద్యమానికి ప్రజా మద్దతు
స్వచ్ఛందంగా తరలివచ్చి సంతకాలు చేసిన వైనం
నేడు నియోజకవర్గాల్లో ప్రజా ఉద్యమం ర్యాలీలు
జిల్లా పార్టీ కార్యాలయానికి సంతకాల పత్రాలు అందజేత
ఈ సంతకం!


