ధాన్యం రైతు దగా
దళారీల చేతిలో
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యం అమ్ముకునేందుకు అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారు. అధికార పార్టీ నాయకులు, మిల్లర్లు, అధికారులు కుమ్మకై ్క రైతులను దగా చేస్తున్నారు. ధాన్యం కొనుగోలులో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలం కావడంతో ఏం చేయాలో పాలుపోక రైతన్నలు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఈ విషయమై కలెక్టర్ గ్రీవెన్స్‌సెల్‌లో సైతం ఫిర్యాదు చేసినా ఎటువంటి ప్రయోజనం చేకూరకపోవడంతో దిక్కుతోచని స్థితిలో కుమిలిపోతున్నారు.
అధికార పార్టీ నేతలదే హవా..
ఖరీఫ్ ప్రారంభం నుంచే రైతులను కష్టాలు వెంటాడుతున్నాయి. తీరా అన్ని ఇబ్బందులకు ఓర్చి ధాన్యం పండించినా అమ్ముకోలేని దుస్థితిలో ఉన్నా రు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసినా పీపీసీ(ప్యాడీ ప్రొక్యూర్‌మెంట్ సెంటర్)లు అస్తవ్యస్తంగా మారాయి. గతంలో వీటి నిర్వహణను ఏజెన్సీలకు అప్పగించారు. ఈసారి టీడీపీ కార్యకర్తలకు, వారి వర్గీయులకు నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. ఫలితంగా పలువురు కూటమి నాయకులు దళారుల అవతారం ఎత్తి రైతులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. మిల్లర్లతో కుమ్మకై ్క నిర్ణీత పరిమాణం కంటే నాలుగైదు కేజీలు అదనంగా ధాన్యం తీసుకుంటున్నారు.
లంచం ఇస్తేనే..
కొందరు అధికారులు లంచాలు డిమాండ్ చేస్తున్నారని, డబ్బులు ఇవ్వకపోతే టార్గెట్ల మంజూరులో తేడాలు చూపుతున్నారని పలువురు మిల్లర్లు ఆరోపిస్తున్నారు. పారదర్శకతలు, అర్హతలు చూడకుండా కేవలం సొంత ప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తనకు అన్ని అర్హతలు ఉన్నా తాను సివిల్ సప్లయ్ జిల్లా మేనేజర్‌కు లంచం ఇవ్వకపోవడంతో రావాల్సిన టార్గెట్‌ను తగ్గించారని టీడీపీకి చెందిన పోలాకి మాజీ ఎంపీపీ, శ్రీదుర్గా మోడరన్ రైస్ మిల్లు యజమాని తమ్మినేని భూషణరావు కలెక్టర్‌కు పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేయడం గమనార్హం.
కమీషన్లకు ఒడిశా ధాన్యం..
ఒడిశా ధాన్యం జిల్లాలోకి భారీ ఎత్తున రవాణా అవుతోంది. ముఖ్యంగా నరసన్నపేట నియోజకవర్గం ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో ఈ రవాణా యథేచ్ఛ గా సాగుతోంది. జిల్లాలోని మిల్లర్లకు ధాన్యం అప్పగించడం..వారు స్థానిక రైతుల పేరిట నమోదు చేసి ఇవ్వడం.. ఇందుకు గాను మిల్లరుకు, అధికారికి, స్థానిక రైతుకు కొంత మేర నగదు ముట్టజెబుతుండటం నిత్యకృత్యంగా మారింది. ఇలా 80 కేజీల బస్తాకు సుమారు రూ.75 నుంచి రూ.100 వరకు వసూలు చేస్తున్నారు. ఈ లెక్కన మెట్రిక్ టన్నుల్లో జరిగే ఈ వ్యాపారంలో ఎంత అవినీతి జరుగుతుందో అర్ధం చేసుకోవచ్చు.
మాట్లాడని మంత్రి..
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడి సొంత జిల్లాలో ధాన్యం విక్రయాల్లో అక్రమాలు జరుగుతున్నా స్పందించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అవినీతి, అరాచకం వెనుక టీడీపీ కార్యకర్తలే లబ్ధి పొందుతున్నారని, అందుకే మంత్రి మాట్లాడటం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు..
ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ టీడీపీ కార్యకర్తల చేతికి వెళ్లాయని ఆమదాలవలస నియోజవకర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త చింతాడ రవికుమార్ గత సోమవారం పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేశారు. మిల్లర్లు, టీడీపీ నాయకులు, పీపీసీ కేంద్రాల నిర్వాహకులు కుమ్మకై ్క రైతులను నట్టేట ముంచుతున్నారని రైతు సంఘం ప్రతినిధులు సోమవారం కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.
మిల్లర్లు, అధికారులు, నాయకులు కుమ్మకై ్క దోచుకుంటున్న వైనం
ఇప్పటికే కలెక్టర్‌కు చేరిన ఫిర్యాదులు
పూర్తిస్థాయిలో ప్రారంభం కాని పీపీసీలు
జిల్లాలోకి యథేచ్ఛగా ఒడిశా ధాన్యం
ధాన్యం రైతు దగా


