నేరడి ఊసెత్తలేదు
● ధాన్యం కొనుగోలుపై అచ్చెన్న నోరు మెదపలేదు
● మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): సీఎం చంద్రబాబు శుక్రవారం మెగా పేరెంట్, టీచర్ మీటింగ్‌లో భాగంగా మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గం భామిని మండలానికి విచ్చేసినా జిల్లాకు పైసా ఉపయోగం లేదని వైఎస్సార్‌సీపీ మాజీ మంత్రి, డాక్టర్స్ విభాగం రాష్ట్ర అధ్యక్షులు సీదిరి అప్పలరాజు మండిపడ్డారు. శ్రీకాకుళం జిల్లా వరప్రదాయినిగా ఉన్న వంశధార ప్రాజెక్టు ఫేజ్–2, స్టేజ్–2లో భాగంగా నేరడి బ్యారేజీ నిర్మాణం కోసం ఒక్క మాట కూడా చెప్పకపోవడం దారుణమన్నారు. ఒడిశాలో బీజేపీ అధికారంలో ఉందని కూటమిలో భాగస్వామిగా ఉన్న సీఎంతో మాట్లాడి నేరడి బ్యారేజీ నిర్మాణంపై ఉన్న సమస్యను పరిష్కరించలేరా అని ప్రశ్నించారు. సీఎంకు శ్రీకాకుళం, మన్యం జిల్లాలపై, ప్రజలపై ఎంత అభిమానం ఉందో తెలుస్తోందన్నారు. నేరడి బ్యారేజీ విషయంలో మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఒడిశా సీఎంతో మాట్లాడి న్యాయపరమైన అడ్డంకులని కొంతవరకు తొలగించే ప్రయత్నం చేశారని గుర్తు చేశారు. కూట మి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు, ఈ ప్రాంతంలో కొత్తగా ఏ ప్రాజెక్టు చేపట్టకపోగా, హిరమండలం లిఫ్ట్ ఇరిగేషన్ వంటి ప్రాజెక్టులు ఆపేయడం దారుణమన్నారు. వ్యవసాయాధారిత జిల్లాగా ఉన్న ప్రాంతంలో వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఉన్నా ప్రాజెక్టులు, వ్యవసాయం వంటి సమస్యల కోసం ప్రస్తావించడం లేదని విమర్శించారు. ఈ–క్రాప్ సరిగా చేయకపోవడం వల్ల ఎంతోమంది రైతుల వివరాలు సరిగా లేకపోవడంతో ధాన్యం కొనుగోలు చేసేందుకు మిల్లర్లు ముందుకు రావడం లేదని, దీన్ని అదునుగా చూసుకుని దళారులు తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారన్నారు. పేరుకే వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు అని పెద్దబాబు, చిన్నబాబులే చక్రం తిప్పుతున్నారన్నారు. వైఎస్సార్‌సీపీ హయాంలో ఒక్క గింజ కూడా దళారులకు అమ్మకుండా ప్రభుత్వమే అంతా కొనుగోలు చేసిందన్నారు.


