మేడం గారూ మధ్యాహ్న భోజనం తినలేకపోతున్నాం..
వజ్రపుకొత్తూరు: ‘మేడం గారూ.. గోవిందపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నాసిరకం మధ్యాహ్న భోజనం తినలేకపోతున్నాం.. సాంబారు నీరులా ఉంది. గుడ్లు అరకొరగా పెడుతున్నారు. మా పిల్లల ఆరోగ్యం పాడవుతోంది.’ అంటూ శుక్రవారం పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ఎదుట గోవిందపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల తల్లిదండ్రులు మొర పెట్టుకున్నారు. ఇటీవల కూడా ఇక్కడి మధ్యాహ్న వంటలు బాగు లేవని విద్యార్థులు చెప్పడంతో తల్లిదండ్రులు వచ్చి వంట నిర్వాహకులను నిలదీశారు. ‘ఇలాగే పెడతాం..మీ దిక్కున చోట చెప్పుకోండి’ అనడంతో ఏమీ చేయలేకపోయారు. కాలేజీ ప్రిన్సిపాల్ రమేష్ పట్నాయక్ దృష్టికి తీసుకెళ్లినా ఆయన స్పందించడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు కారి రాజులమ్మ, జానకి, కారి జ్యోతి, ఉమారాణి, సీహెచ్ జగదాంబ ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లారు. మెనూ అమలు చేయాలని ఎమ్మెల్యేను కోరారు.
స్క్రబ్ టైఫస్‌తో జాగ్రత్త: కలెక్టర్
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలోని ప్రజలందరూ స్క్రబ్ టైఫస్ వ్యాధి నియంత్రణ, నివారణ చర్యలపై అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పష్టం చేశా రు. కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం వైద్య ఆరోగ్య శాఖాధికారులు, జిల్లాలోని ప్రైవేట్ ల్యాబ్ టెక్నీషియన్లతో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. ఐదు రోజులు పూర్తిగా జ్వరం తగ్గని వారు స్క్రబ్ టైఫస్ వ్యాధి నిర్ధారణ పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలన్నారు. ‘చిగ్గర్ మైట్’ అనే కీటకం కుట్టడం ద్వారా ఈ ఇన్‌ఫెక్షన్ మనుషులకు సోకుతుందని వివరించారు. ప్రజలు ఎలాంటి భయబ్రాంతులకు గురికావాల్సిన అవసరం లేదని, వ్యాధి నిర్ధారణకు సరిపడా కిట్‌లను అందుబాటులోకి తెస్తున్నామని తెలిపారు. అయితే, ప్రభుత్వ నిబంధనలకు లోబడే ప్రైవేట్ ల్యాబ్‌లు పరీక్షల ధరలను నిర్ధారించాలని ఆదేశించారు. ఈ వ్యాధి ముఖ్యంగా పొదలు, గడ్డి, పొలాలు, అడవి ప్రాంతాల్లో ఉండే చిగ్గర్లు కుట్టడం వల్ల వస్తుందని, వ్యవసాయ పనులు చేసేవారు, పశువుల పాకల్లో తిరిగేవారికి ప్రమాదం ఎక్కువగా ఉంటుందని, అధిక జ్వరం, తీవ్ర తలనొప్పి, శరీర బలహీనత, వాంతులు ఈ వ్యాధి లక్షణాలుగా ఉంటాయని, కీటకం కుట్టిన చోట నల్లటి మచ్చ కూడా కనిపించవచ్చని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి అనిత చెప్పారు. పొలాలు, పొదల్లో పనిచేసేటప్పుడు శరీరాన్ని పూర్తిగా కప్పే దుస్తులు ధరించాలని, చేతులు, కాళ్లపై కీటక నాశక లోషన్ ఉపయోగించాలని సూచించారు. జ్వరం, శరీర బలహీనత వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే దగ్గరలోని పీహెచ్‌సీ లేదా ప్రభుత్వ ఆస్పత్రిలోని వైద్యులను సంప్రదించాలి. సొంతంగా మందులు కొనుగోలు చేయకుండా, వైద్యులు సూచించిన యాంటీ బయాటిక్స్‌ను సమయానికి తీసుకోవాలని కోరారు.


