ఏమి సేతుము బాబూ!
● సేతుభీమవరంలో రైతులకు వర్తించని అన్నదాత సుఖీభవ
● ఇనాం భూములు, కౌలురైతుల పేరిట
పథకానికి దూరం చేసిన చంద్రబాబు సర్కారు
● వైఎస్సార్‌సీపీ పాలనలో రైతుభరోసా
అందిందంటున్న గ్రామస్తులు
● కలెక్టరేట్ వద్ద ధర్నాకు సమాయత్తం
జి.సిగడాం:
నమ్మి ఓటు వేస్తే నట్టేట ముంచేశారని జి.సిగడాం మండలం సేతుభీమవరం గ్రామానికి చెందిన రైతులు వాపోతున్నారు. ఇనాం భూములు, కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ పథకం వర్తింపజేయకపోవడంతో గ్రామంలో 150 మంది రైతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇనాం, కౌలు రైతులకు రైతు భరోసా పథకం వర్తింపజేశారని, ఐదేళ్లూ సకాలంలో రైతుల ఖాతాల్లో సొమ్ము జమ చేశారని గుర్తు చేస్తున్నారు. అప్పుడు లేని సమస్య ఇప్పుడెందుకని బాధిత రైతులంతా ప్రశ్నిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ త్వరలో కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తామని చెబుతున్నారు. అధికారులు మాత్రం తమకు ఆదేశాలురాలేదంటూ చేతులు దులుపుకొంటున్నారు.
ఇదీ పరిస్థితి..
చంద్రబాబు ప్రభుత్వం రెండు విడతలు చొప్పున అన్నదాత సుఖీభవ పథకం– పీఎం కిసాన్ పథకం ద్వారా రైతుకు రూ.14 వేలు చొప్పున విడుదల చేసింది. కానీ సేతుభీమవరం గ్రామంలో రైతులకు ఒక్క రూపాయి కూడా జమకాలేదని గ్రామానికి చెందిన బొల్లు జమ్మినాయుడు, బొల్లు కూర్మినాయుడు, పోగతోక రాంబాబు, పైల ఆదినారాయణ, పైల త్రినాథరావు, బొల్లు రమణ, సాకాబత్తుల గోపాలరావు, మావిడి అప్పారావు, కె.సురేష్, కె.అప్పారావు, సాకాబత్తుల శ్రీరాములు, కుదిరెళ్లు అప్పారావు, సాకాబత్తుల లక్ష్మణరావు తదితర 150 మంది గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే జిల్లా ఉన్నతాధికారులకు వినతిపత్రాలు అందించినా ఫలితం లేకపోయిందన్నారు.
జగనన్న హయాంలో..
వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో గ్రామంలోని ఇనాం, కౌలు రైతులు 150 మందికీ ప్రతి ఏటా రూ.13,500 చొప్పున ఠంఛన్‌గా జమ చేసేవారు. జగనన్న పాలనలో గ్రామంలో సుమారు 1.10 కోట్ల రూపాయల మేర రైతులు లబ్ధి పొందారు. అవసరమైన ఎరువులు రైతుల ఇంటికే చేర్చేవారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రైతులకు ఇబ్బందులే తప్ప ఎటువంటి సంక్షేమం అందలేదని రైతులు మండిపడుతున్నారు.
అప్పుడే బాగుంది..
వైఎస్సార్ సీపీ పాలనలో మా గ్రామ రైతులంతా ఆనందంగా జీవించాం. రైతు భరోసాతోపాటు పలు సంక్షేమ పథకాలు అందేవి. పంటలు బాగా పండించుకుని మద్దతు ధరకు అమ్మేవాళ్లం. చంద్రబాబు ప్రభుత్వంలో అన్నదాత సుఖీభవ రెండు విడతలూ ఇవ్వలేదు.
– పైల దుర్గారావు, రైతు, సేతు భీమవరం
మంత్రికి విన్నవించినా..
పథకాలు అందడంలేదని మంత్రి నారా లోకేష్ వద్దకు వెళ్లి వినతిపత్రం అందించాం. అయినా పరిష్కారం కాలేదు. మా కార్యకర్తలకే న్యాయం చేయలేకపోతున్నాం.
– సాకాబత్తుల శ్రీరాములు, సేతుభీమవరం
ఫలితం లేదు..
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో గ్రామస్తులకు అన్ని సంక్షేమ పథకాలు ఇంటికే చేరేవి. కూటమి ప్రభుత్వం వచ్చాక 150 మంది రైతులకు అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ డబ్బులు పడలేదు. అధికారులకు వినతులు ఇచ్చినా ఫలితం రాలేదు. – తొత్తడి రామారావు,
సర్పంచ్, సేతుభీమవరం
ఏమి సేతుము బాబూ!
ఏమి సేతుము బాబూ!
ఏమి సేతుము బాబూ!
ఏమి సేతుము బాబూ!


