వేడుక వేళ విషాదం
● గృహ ప్రవేశానికి వచ్చి అనంత లోకాలకు..
● రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం
● మరొకరి పరిస్థితి విషమం
పలాస/వజ్రపుకొత్తూరు రూరల్/పాతపట్నం: పలాస మండలం గరుడఖండి పాత జాతీయ రహదారిపై గురువా రం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో పాతపట్నం మండలం సరాళి గ్రామానికి చెందిన యువకుడు తలగాపు భీమారావు(27), ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లా మహేంద్రగౌడ్ గ్రామానికి చెందిన సుశాంత్ పైకో (25) దుర్మరణం పాలయ్యారు. వీరభద్రాపురం గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్థి తలగాపు వేణు తీవ్ర గాయాలపాలయ్యాడు. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల మేరకు.. భీమారావు, వేణు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ఒడిశాకు చెందిన సుశాంత్ మరో బైక్‌పై ఎదురెదురుగా వస్తూ గరుడఖండి రోడ్డులో ఉన్న పెట్రోల్ బంక్ వద్ద పరస్పరం ఢీకొన్నారు. ఈ ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందగా.. గాయపడిన వేణును పలాస ప్రభుత్వ అసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం నిమిత్తం రిమ్స్‌కు తరలించారు.
ఆనందంగా గడిపి..
సరాళికి చెందిన భీమారావు విశాఖపట్నంలో ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. 20 ఏళ్ల క్రితం తండ్రి శాంతారావు మృతి చెందడంతో తాతగారి గ్రామం సరాళిలో స్థిరపడ్డారు. సొంత గ్రామమైన వీరభద్రపురంలో బంధువులతో కలిసి ఇటీవల ఇల్లు నిర్మించారు. గురువారం గృహప్రవేశం కోసం విశాఖపట్నం నుంచి వచ్చిన భీమారావు విందు అనంతరం బంధువులు, స్నేహితులతో సరదాగా గడిపాడు. తర్వాత పెట్రోల్ కోసం సోదరుడి వరసైన తలగాపు వేణుతో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్లారు. ఇంతలో ఘోరం జరిగింది. కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. భీమారావుకు తల్లి లక్ష్మీ, సోదరుడు ఉన్నారు. ఘటనా స్థలాన్ని కాశీబుగ్గ పోలీసులు పరిశీలించారు. కాశీబుగ్గ ఎస్‌ఐ నర్సింహమూర్తి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వేడుక వేళ విషాదం
వేడుక వేళ విషాదం


