మిల్లర్లకు కొమ్ముకాయవద్దు
● అధికారులకు స్పష్టం చేసిన
కంబకాయ రైతులు
నరసన్నపేట : ‘ధాన్యం అమ్ముకోవడానికి ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ధాన్యం కొనుగోలు చేయాలి. మిల్లర్లకు కొమ్ము కాయవద్దు.. రైతులకు సహకారం అందించండి..’ అంటూ కంబకాయ గ్రామ రైతులు ముక్తకంఠంతో కోరారు. మిల్లర్లు చేస్తున్న దోపిడీ.. రైతులకు కలుగుతున్న నష్టాలపై గురువారం సాక్షిలో కథనాలు రావడంతో అధికారులు ఉరుకులు.. పరుగులు తీశారు. సీఎంఓ ఆఫీస్ నుంచి కూడా వివరణ కోరడంతో ఉదయానికే ఆర్డీఓ సాయి ప్రత్యూష నరసన్నపేటలో వివాదానికి కారణమైన రైస్‌మిల్లుకు వెళ్లి ఆరా తీశారు. రైతులకు ఇబ్బంది కలిగించ వద్దని మిల్లర్లకు సూచించారు. రైతుల నుంచి ఫిర్యాదులు వస్తే బాధ్యులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. సాయంత్రం ఈ వ్యవహరంపై సీఎంఓ కార్యాలయం నుంచి వివరణ కోరగా తహసీల్దార్ టి.సత్యనారాయణ, సివిల్ సప్లయ్ డీటీ రామకృష్ణ, శ్రీకాకుళం సివిల్ సప్లయ్ కార్యాలయ క్వాలిటీ కంట్రోల్ ఇన్‌స్పెక్టర్ హరిశంకర్.. కంబకాయ వెళ్లి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా అధికారుల తీరును రైతులు తీవ్రంగా దుయ్యబట్టారు. బుధవారమే తమకు న్యాయం చేస్తే ఇంత వరకూ వచ్చేదికాదన్నారు. మిల్లర్లకు వంత పాడవద్దని.. ఏ మాత్రం అవకాశం ఉన్నా రైతులకు అండగా ఉండాలని కోరారు. అనంతరం గ్రామంలో పండిన ధాన్యం శాంపిల్స్‌ను తీసుకువచ్చి నాణ్యతను పరిశీలించారు. నాణ్యత బాగున్నట్లు అధికారులు గుర్తించారని రైతులు అప్పలనాయుడు, పాగోటి భరద్వాజ్ తెలిపారు. 82 కేజీలు ఇవ్వడానికి రైతులు సిద్ధపడగా.. ఈమేరకు మిల్లర్లుకు ఒప్పించాలని, అంతకంటే అదనంగా తీసుకోవద్దని కోరారు. అధికారులు దీనిపై హామీ ఇవ్వలేదని తెలుస్తోంది. మిల్లర్లతో మరోసారి సమావేశం ఏర్పాటు చేస్తామని తహసీల్దార్ తెలిపారు.


