జిల్లాకు వర్షసూచన
శ్రీకాకుళం పాతబస్టాండ్ : నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం తుఫాన్‌గా మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో శుక్రవారం శ్రీకాకుళం జిల్లాలో వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.
బియ్యం బదులుగా రాగులు
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలోని రేషన్‌కార్డు లబ్ధిదారులకు డిసెంబర్ కోటాలో బియ్యం బదులుగా మూడు కిలోలు వరకు రాగులు పంపిణీ చేయనున్నట్లు జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ గురువారం వెల్లడించారు. ప్రజలకు పోషకాహారం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. ప్రతి రేషన్ డిపోలో ఏర్పాట్లు పూర్తయ్యాయని, లబ్ధిదారులు రేషన్ కార్డులతో వెళ్లి రాగులు తీసుకోవాలని కోరారు.
ధాన్యలక్ష్మిగా నీలమణి
అవలింగి నీలమణి అమ్మవారిని మార్గశిర మాస మొదటి గురువారం పురస్కరించుకుని ధాన్యలక్ష్మిగా అలంకరించారు. అర్చకు లు భాస్కర ఆచారి ఆధ్వర్యంలో విశేష పూజ లు, అభిషేకాలు నిర్వహించారు. – సారవకోట
జిల్లాకు చేరిన శాసనసభ అంచనాల కమిటీ
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఆంధ్రప్రదేశ్ శాసన సభ అంచనాల కమిటీ 2024–25 రెండు రోజుల పర్యటనలో భాగంగా గురువారం జిల్లాకు చేరుకుంది. కమిటీ చైర్మన్ వేగుళ్లు జోగేశ్వరరావు(ఎమ్మెల్యే), డాక్టర్ వి.వి.సూర్యనారాయణరాజు పెనుమత్స(ఎమ్మెల్సీ), వరుదు కళ్యాణి (ఎమ్మెల్సీ) ఉన్నారు. వీరితో పాటు రాష్ట్ర శాసన సభ డిప్యూటీ సెక్రటరీ కె.రాజాకుమార్, అసిస్టెంట్ సెక్రటరీ వి.బిక్షం, సెక్షన్ ఆఫీసర్ టి.చిరంజీవి ఉన్నారు. వీరికి ఇన్‌చార్జి జిల్లా రెవెన్యూ అధికారి లక్ష్మణమూర్తి, రెవెన్యూ డివిజనల్ అధికారి కె.సాయి ప్రత్యూష, డీఎస్పీ వివేకానంద, డీఆర్‌డీఏ పీడీ కిరణ్ కుమార్, డ్వామా పీడీ సుధాకర్, తహసీల్దార్లు గణపతిరావు, శ్రీనివాసరావు స్వాగతం పలికారు. కాగా, కమిటీ సభ్యులు శుక్రవారం ఉదయం అరసవల్లి సూర్యనారాయణ స్వామి, శ్రీకూర్మంలోని కూర్మనాథ స్వామిని దర్శించుకుంటారు. అనంతరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం 10.30 గంటలకు అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు.
ధాన్యం సేకరణపై సమీక్ష
శ్రీకాకుళం పాతబస్టాండ్ : వర్షసూచన నేపథ్యంలో ధాన్యం సేకరణ వేగవంతం ఏయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ధాన్యం కొనుగోలు, సంక్షేమ వసతి గృహాలు, ఆర్టీజీఎస్, ప్రజా సానుకూల దృక్పథం తదితర అంశాలపై కలెక్టర్లతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జేసీ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థిని అవయవదానం
రణస్థలం: లావేరు మండలం గోవిందపురం పంచాయతీ ఇజ్జాడపాలెం గ్రామానికి చెందిన ఇజ్జాడ ధనలక్ష్మి(17) మరణంలోనూ సజీవంగా నిలిచింది. బాలిక ఇటీవల అనారోగ్యానికి గురికావడంతో రాగోలు జెమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ కావడంతో బుధవారం మరణించింది. తల్లిదండ్రులు ఇజ్జాడ రాము, సాయిలు తీవ్ర విషాదంలోనూ ముందుకొచ్చి తమ కుమార్తె అవయవాలను దానం చేయాలని నిర్ణయించారు. కిడ్నీ, గుండె దానం చేసి మరో రెండు కుటుంబాల్లో వెలుగులు నింపారు. జెమ్స్ ఆస్పత్రి నుంచి రోడ్డు మార్గాన గ్రీన్ చానల్ ద్వారా విశాఖ విమానాశ్రయానికి అవయవాలు చేరుకున్నాయి. ప్రత్యేక అంబులెన్స్ ద్వారా విమానాశ్రయానికి చేరుకున్న వీటిని వైద్యుల పర్యవేక్షణలో ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి తరలించారు. అక్కడి నుంచి గ్రీన్ చానల్ ద్వారా సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు.


