చూసొద్దాం రండి!
పుస్తక ప్రపంచం
శ్రీకాకుళం కల్చరల్: జిల్లాలో తొలిసారిగా వందకుపైగా పుస్తక ప్రచురణ సంస్థలతో సిక్కోలు పుస్తక మహోత్సవం–2025 సందడిగా సాగుతోంది. సిక్కోలు పుస్తక కమిటీ, జనవిజ్ఞాన వేదిక, పలు సాహితీ సంస్థల సంయుక్త నిర్వహణలో శ్రీకాకుళం ఏడు రోడ్ల జంక్షన్ వద్ద ఎన్టీఆర్ మున్సిపల్ హైస్కూల్ మైదానంలో పుస్తక మహోత్సవం పుస్తక ప్రియులకు కనువిందు చేస్తోంది. అనేక మంది పుస్తక ప్రియులు తరలివస్తూ పుస్తకాలు కొనుగోలు చేస్తుండటంతో నిర్వాహకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
పుస్తకాల పందిరి..
హెలెన్ కిల్లర్ జీవిత కథతో మీకు పుస్తక ప్రదర్శన స్వాగతం పలుకుతుంది. అబ్దుల్ కలాం మేలుమలుపులు.. త్రిపురనేని గోపీచంద్ రచనా సర్వస్వం, శ్రీకృష్ణదేవరాయలు, శ్రీనాథ కవి సార్వభౌముడు వంటి మహనీయుల జీవిత చరిత్రలు ఇక్కడ దర్శనమిస్తాయి. స్వామి వివేకానంద వంటి స్ఫూర్తిదాయక పుస్తకాలకు కొదవే లేదు.
పిల్లల కోసం..
నీతి కథలు, రామాయణ మహాభారతాలు, బొమ్మరిల్లు కథలు, అల్లావుద్దీన్ అద్భుత దీపం, బట్టి– విక్రమార్క కథలు, పంచతంత్ర కథలు, అరేబియన్ నైట్స్, విలువలు నేర్పే మంచి మంచి కథల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. 1970 నుంచి 2012 మధ్యలో వచ్చిన చందమామ కథలన్నీ ఓ పుస్తకంగా తీసుకొచ్చారు.
భాషలపై పట్టు సాధించేందుకు..
రోజుల వ్యవధిలో కొత్త భాష నేర్చుకోవాలి అని ఉందా? తమిళం, ఇంగ్లీషు, మళయాళం వంటి ఇతర భాషలపై పట్టు సాధించాలా? అయితే మీకోసం పుస్తక ప్రదర్శనలో వివిధ భాషలను 30 రోజుల్లో ఎలా నేర్చుకోవాలో.. ఎలా మాట్లాడాలో తెలిపే పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి.
వ్యక్తిత్వ వికాసాలు..
బీవీ పట్టాభిరామ్, యండమూరి వీరేంద్రనాథ్ వంటి రచయితలు రాసిన వ్యక్తిత్వ వికాస పుస్తకాలు కోకొల్లలు. ‘కష్టపడి పనిచేయద్దు –ఇష్టపడి పని చేయండి’, ‘విజయం మీదే’, ‘గుడ్ పేరెంట్’ ‘లీడర్షిప్’, ‘మైండ్ మ్యాజిక్’, ‘జీవితం ఒక ఉత్సవం’ లాంటి ఎన్నో పుస్తకాలతో మనల్ని మనం తీర్చిదిద్దుకోవచ్చు. ఇక డిటెక్టివ్ నవలలు, మెదడుకు మేత వంటి పుస్తకాలు సైతం అందుబాటులో ఉన్నాయి.
నేటి కార్యక్రమాలివే..
కడపకు చెందిన బాలభాయన్న ఆధ్వర్యంలో మ్యాజిక్ షో, ‘కళింగాంధ్ర కవిత’పై చర్చా గోష్టి, గోర్ల వెంకటరావు బృందం ఎరుకల పాట, సాంఘిక నాటిక, జానపద, పాశ్చాత్య నృత్యాలు, వాసుదేవాచారి ఘజల్స్ ప్రదర్శనలు ఉంటాయి. పలు పుస్తకావిష్కరణలు, సైన్స్ కార్యక్రమాలు జరుగుతాయి.
విశాఖ నుంచి వచ్చా..
పుస్తక మహోత్సవం పేరిట మంచి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. పుస్తకం చిరస్థాయిగా నిలిచేది. ఇటువంటి ప్రదర్శనల ద్వారా పుస్తకాలు చదవాలనే ఉత్సాహం ప్రజల్లో పెరుగుతుంది. అందుకే విశాఖ నుంచి ప్రదర్శన తిలకించేందుకు వచ్చాను.
– మజ్జి దేవిశ్రీ, ప్రజా గాయకుడు, విశాఖ
అన్ని వర్గాలకు..
పుస్తక ప్రదర్శనలో ఎన్నో మంచి పుస్తకాలు అందుబాటులోకి తీసుకొచ్చారు. పాత తరం పుస్తకాలు కూడా కొత్తగా ముద్రించి తీసుకువచ్చారు. అన్ని వర్గాలకు చెందిన పుస్తకాలు ప్రదర్శనలో ఉండటం ఆనందంగా ఉంది.
– ఇప్పిలి గోవిందరావు, పాఠకుడు, శ్రీకాకుళం
సందడిగా సిక్కోలు పుస్తక మహోత్సవం–2025
వందలాది పుస్తక ప్రచురణ సంస్థలతో కళకళ
అన్ని రకాల పుస్తకాలు
అందుబాటులో..
చూసొద్దాం రండి!
చూసొద్దాం రండి!
చూసొద్దాం రండి!
చూసొద్దాం రండి!
చూసొద్దాం రండి!


