వరి..
కొనేవారేరీ?
జిల్లాలో గతేడాది పరిస్థితి..
జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు 5,29,964 మెట్రిక్ టన్నులు
ధాన్యం కొనుగోళ్ల మొత్తం రూ.1218.94 కోట్లు
ధాన్యం విక్రయించిన రైతులు 1,13,861 మంది
పీపీసీలు సుమారు 400
శ్రీకాకుళం పాతబస్టాండ్: చంద్రబాబు ప్రభుత్వంలో అన్నదాతలకు కష్టాలు తప్పడం లేదు. ఖరీఫ్ ప్రారంభంలో ఎరువులు అందక ఇబ్బందులు పడగా.. ఇప్పుడు కోతలు మొదలైనా ధాన్యం కొనేవారు లేక రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రభుత్వం సకాలంలో కొనుగోలుకు ప్రణాళిక చేయకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. జిల్లాలో పోలాకి, కోటబొమ్మాళి, సారవకోట తదితర మండలాల్లో ఇప్పటికే వరి కోతలు ప్రారంభమయ్యాయి. ధాన్యం కొనుగోలు చేసేవారు లేక, వర్షాలు, ఇతర సమస్యలతో రైతులు దళారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది.
ఆది నుంచి అవస్థలే..
ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ప్రారంభం నుంచే రైతులకు కష్టాలు మొదలయ్యాయి. ముందస్తు ప్రణాళిక లేక సకాలంలో ఎరువులను అందించలేకపోయింది. ఇప్పుడు పంట కోతకు వచ్చినా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు.
పీపీసీ సెంటర్ల గుర్తింపు ఎప్పుడో?
ఈ ఏడాది ధాన్యం కొనుగోలు కేంద్రాలు (పీపీసీ) ఎంపికలు ఇప్పటి వరకు పూర్తి కాలేదు. వీటిని వెలుగు, కో ఆపరేటివ్ సోసైటీలు, డీసీఎంఎస్, మరికొన్ని ప్రయివేటు సంస్థలు నిర్వహిస్తాయి. వీటికి ధాన్యాన్ని రైతు భరోసా కేంద్రాల ద్వారా అందజేయాల్సి ఉంటుంది. అయితే ఈ పీపీసీల ఎంపికల్లో జాప్యం జరుగుతోంది. ఎమ్మెల్యేల సిఫారసులు ఉన్న వారికి మాత్రమే ఇవ్వాలని అధికార పార్టీ నాయకులు పట్టుపట్టడంతో జాప్యం జరుగుతోంది. గత ఏడాది ఈ కేంద్రాలు సరిగా నిర్వహించని వారికి ఈ ఏడాది ఇచ్చే అవకాశం లేదు. అయినప్పటికీ అటువంటి నిబంధనలు పక్కన పెట్టాలని నాయకులు అధికారులపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. అందుకే పీపీసీల ఏర్పాటు జరగడం లేదు.
ఇదీ పరిస్థితి..
ఈ ఏడాది జిల్లాలో 3.70 లక్షల ఎకరాల్లో వరి సాగు వేశారు. సుమారు 10 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం పంట దిగుబడి వస్తుందని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. అయినా ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలుకు చర్యలు చేపట్టలేదు. ఇటీవల రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి జిల్లా పర్యటనలో భాగంగా ధాన్యం కొనుగోలుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. గోనె సంచులు, తార్పాలీన్లు అందజేస్తామన్నారు. అయినా ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు.
ఈ ఏడాది మద్దతు ధరలు ఇలా...
ప్రభుత్వం కామన్ రకం ధాన్యానికి క్వింటాకు రూ.2,360 మద్దతు ధర ప్రకటించింది. 80 కిలోల బస్తా రూ.1895, గ్రేడ్–ఏ రకానికి రూ.2,389 ప్రకటించింది.
ప్రారంభం కాని ధాన్యం కొనుగోళ్లు
కొన్ని మండలాల్లో ప్రారంభమైన వరి కోతలు
పీపీసీ సెంటర్ల ఏజెన్సీల
ఎంపికలో రాజకీయ జోక్యం
వరి..


