వరి ఓవులు మాయంపై ఫిర్యాదు
బూర్జ: తనకున్న 24 సెంట్ల భూమిలో వరి పండించి కోతలు కోసం ఆరబెడితే గుర్తు తెలియని వ్యక్తులు పట్టుకుపోయారని బూర్జ మండలం కంట్లాం పంచాయతీ లచ్చయ్యపేట గ్రామానికి చెందిన కొంచాడ మన్మధరావు వాపోయారు. వారం కిందట కోత కోసి ఓవులను పొలంలోనే ఉంచానని, తాను తిరుపతి క్యాంపునకు వెళ్లిన సమయంలో బుధవారం ఓవులను మాయం చేశారని డయల్ 100 ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వ్యక్తి అరెస్టు
టెక్కలి రూరల్: టెక్కలి నుంచి నౌపడ వెళ్లే దారిలో తలగాం జంక్షన్ సమీపంలో ఈ నెల 7న అర్థరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇజ్జువరం అప్పయ్య అనే వ్యక్తి మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదానికి కారణమైన వ్యక్తిని శుక్రవారం టెక్కలి పోలీసులు అరెస్టు చేశారు. సీసీ కెమెరాలు, ఇతర ఆధారాల సాయంతో శ్రీకాకుళం బలగమెట్టు ప్రాంతానికి చెందిన మీగడ గోపి ఈ ప్రమాదానికి కారణమైన వ్యక్తిగా గుర్తించారు. కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
పలాస మున్సిపల్ కమిషనర్‌పై కేసు కొట్టివేత
పలాస: పలాస కాశీబుగ్గ మున్సిపల్ కమిషనర్ నడిపేన రామారావుపై నమోదైన కేసును హైకోర్టు కొట్టివేసింది. గతంలో ఏసీబీ కేసు నమోదై ఉన్నందున కమిషనర్‌గా కొనసాగరాదని పలాసకు చెందిన ఓ వ్యక్తి మరికొందరితో కలిసి కోర్టులో కేసు వేశారు. దీనిపై విచారించిన కోర్టు కేసు కొట్టి వేసిందని కమిషనర్ రామారావు శుక్రవారం పేర్కొన్నారు.
డొంకూరులో ఉద్రిక్తత
ఇచ్ఛాపురం రూరల్: మండలంలోని డొంకూరులో రెండు వర్గాల మధ్య శుక్రవారం కొట్లాట జరిగింది. ఓ వర్గం వారు చేపల్ని జెట్టీలో ఉంచేందుకు ప్రయత్నించగా, అక్కడే ఉన్న మరో వర్గం వారు అడ్డు చెప్పడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న సీఐ ఎం.చిన్నంనాయుడు అప్రమత్తమై వెంటనే పట్టణ ఎస్‌ఐ ముకుందరావు, కవిటి ఎస్‌ఐ రవివర్మలు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. తోపులాటలో గాయాలపాలైన వారు ఇచ్ఛాపురం సామాజిక ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు.
తిరుపతిరావుకు గురుబ్రహ్మ అవార్డు
జి.సిగడాం: జి.సిగడాం మోడల్ స్కూల్ భాషోపాధ్యాయుడు కోట తిరుపతిరావుకు రాష్ట్రస్థాయిలో గురుబ్రహ్మ అవార్డు వరించింది. ఈ మేరకు విశాఖపట్నంకు చెందిన మదర్‌థెరిస్సా ఫౌండేషన్ అధ్యక్షుడు కె.కృష్ణమూర్తి శుక్రవారం సమాచారం తెలియజేశారు. ఈ నెల 16న శ్రీకాకుళంలోని బాపూజీ కళామందిరంలో అవార్డును ప్రదానం చేయనున్నారు. ఈ సందర్భంగా తిరుపతిరావును ప్రిన్సిపాల్ డబ్బీరు గణేష్ పట్నాయక్, సిబ్బంది అభినందించారు.


