క్షేత్రస్థాయి శిక్షణతో నైపుణ్యాలు మెరుగు
శ్రీకాకుళం న్యూకాలనీ: ఇంటర్ విద్యను అభ్యసిస్తున్న వృత్తి విద్య కోర్సుల విద్యార్థులకు క్షేత్రస్థాయి పర్యటనలతో నైపుణ్యాలు మరింత మెరుగవుతాయని ఇంటర్మీడియెట్ విద్య జిల్లా వృత్తి విద్యాశాధికారి(డీవీఈఓ) రేగ సురేష్ కుమార్ అన్నారు, జిల్లా వ్యాప్తంగా వృత్తివిద్య కోర్సుల వారికి జరుగుతున్న ఆన్ ది జాబ్ ట్రైనింగ్ (ఓజేటీ)ను కమిటీ సభ్యులతో కలిసి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆమదాలవలస ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎంఅండ్ ఏటీ కోర్సుకు చెందిన విద్యార్థులు ఎచ్చెర్లలోని శివానీ ఇంజనీరింగ్ కాలేజీలో నిర్వహిస్తున్న వర్క్ షాప్‌ను సందర్శించారు. శ్రీకాకుళం ప్రభుత్వ బాలురు జూనియర్ కళాశాలకు చెందిన సీజీఏ గ్రూప్ విద్యార్థులు నిర్వహిస్తున్న ఓజేటీ, బాలికల కళాశాల సీఎస్‌ఈ విద్యార్థులు శిక్షణ పొందుతున్న కంప్యూటర్ కోచింగ్ సెంటర్లను పరిశీలించారు. వివిధ ఆస్పత్రుల్లో ఎంపీహెచ్‌డబ్ల్యూ, ఎంఎల్‌టీ కోర్సులకు చెందిన జాబ్ ట్రైనింగ్ శిక్షణా సరళి, రికార్డులను తనిఖీ చేశారు. డిసెంబర్ 31 వరకు శిక్షణ కొనసాగుతుందని డీవీఈఓ తెలిపారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు బి.శ్యాంసుందర్, డి.రాంప్రసాద్, ఎంఏఎస్ శ్రీనివాస్, ఎం.కృష్ణవేణి, జి.వెంకటేశ్వరరావు, జె.రవిబాబు తదితరులు పాల్గొన్నారు.


