వాటర్ ప్లాంట్ పనులు అడ్డగింత
రణస్థలం: ఆక్వా బ్రేవరీస్ వాటర్ ప్లాంట్ పనులను రణస్థలం పంచాయతీ ప్రజలు శుక్రవారం అడ్డుకున్నారు. ప్లాంట్ పెడితే భూగర్భ జలాలు అడుగంటిపోయి పొలాలు బీడు భూములుగా మారిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న జె.ఆర్.పురం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పనులు అడ్డగించడం సరికాదని, ఏదైనా సమస్య ఉంటే తహసీల్దార్, పోలీసులకు తెలియజేయాలన్నారు. అయితే, వాటర్ ప్లాంట్ యాజమాన్యం బౌన్సర్లను తీసుకువచ్చి పనులు చేయించడం ఏంటని గ్రామస్తులు అభ్యంతరం తెలిపారు. దింతో పోలీసులు ఇరువర్గాలు పోలీస్ స్టేషన్‌కు వచ్చి సమస్యను పరిష్కరించుకోవాలని చెప్పారు. అనంతరం ఎస్సై చిరంజీవి సమక్షంలో తహసీల్దార్ వద్ద సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు. తహసీల్దార్ సనపల కిరణ్ కుమార్‌ను సంప్రదించగా గ్రామస్తులంతా సంతకాలతో వినతిపత్రం అందిస్తే ఉన్నతాధికారులకు తెలియజేస్తామన్నారు. ప్లాంట్ యాజమాన్యం ప్రతినిధి ఎన్.కిరణ్ మాట్లాడుతూ భూగర్భ జల శాఖ, కాలుష్య నియంత్రణ, రెవెన్యూ, పంచాయతీ తదితర అనుమతులు ఉన్నాయని స్పష్టం చేశారు.


