అడుగుకో గుంత.. గజానికో గొయ్యి
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: జిల్లాలోని రహదారులు గోతులమయంగా మారాయి. అడుగుకో గుంత...గజానికో గొయ్యిలా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం వర్షాలు పడుతుండటంతో రోడ్లపై వరద నీరు నిలిచిపోయి ఎక్కడ గుంత ఉందో...ఏ పక్కన గొయ్యి ఉందో తెలియక వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. అంతర్గత రోడ్ల పరిస్థితి మారింత దారుణంగా ఉంది.
దుష్ప్రచారంతో నాడు తప్పుదోవ
వైఎస్ జగన్ ప్రభుత్వంలో జిల్లాలో రూ.526.69 కోట్లతో ఆర్‌అండ్‌బీ పరిధిలో 432 రోడ్లు నిర్మించింది. పంచాయతీరాజ్ పరిధిలో ఏఐఐబీ కింద రూ.352.78కోట్లతో 312 రోడ్లు వేసింది. ఆర్‌సీపీఎల్‌డబ్ల్యూ కింద రూ.70.96కోట్లతో 23 రోడ్ల నిర్మాణం చేపట్టింది. గిరిజన ప్రాంతాల్లో రూ.56.35 కోట్లతో 42సీసీ, బీటీ రోడ్లు నిర్మాణం చేపట్టింది. కానీ ప్రతిపక్షాలన్నీ మూకుమ్మడిగా రోడ్లపై దుష్ప్రచారానికి దిగాయి.
నేడు గుంతలు పూడ్చలేని పరిస్థితి..
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పల్లె పండగ పేరుతో పెద్ద ఎత్తున హడావుడి చేసింది. వేసిన రోడ్లు కంటే ప్రచారమే ఎక్కువ జరిగింది. 2025 జనవరి నాటికి రోడ్లను అద్దంలా మార్చేస్తామంటూ చంద్రబాబుతో సహా అందరూ డాంబికాలు పలికారు. కానీ ప్రచారం చేసినంత వేగంగా పనులు చేయలేదు. రోడ్లు వేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు కూడా చెల్లింపులు చేయకపోవడంతో చాలా పనులు ఎక్కడికక్కడ నిలిపివేశారు. ఆర్‌అండ్‌బి పరిధిలోని రోడ్లు పరిస్థితి కూడా అంతే.
నరకయాతన..
ప్రస్తుతం రోడ్ల నిర్వహణ గాలికి వదిలేయడంతో ఉన్న రోడ్లు కూడా పాడైపోతున్నాయి. శ్రీకాకుళం నగరంలోని సెవెన్ రోడ్డు జంక్షన్ నుంచి డే అంట్ నైట్ జంక్షన్ ఉన్న రోడ్డు చూస్తే కూటమి ప్రభుత్వం, పాలకుల చిత్తశుద్ధి ఎలా ఉందో అవగతమవుతుంది. రోడ్డు పొడవునా గుంతలే. రోజూ అధికారులు రాకపోకలు సాగించే జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారి గుంతలనే పూడ్చకపోతే జిల్లాలో మిగతా రహదారుల పరిస్థితిని ఊహించుకోవచ్చు. క్వారీలు, ఇసుక ర్యాంపుల నుంచి వచ్చే వాహనాలతో పల్లె దారులు ఛిద్రమవుతున్నాయి. దీంతో ఎక్కడికక్కడ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం వర్షాలు పడుతుండటంతో రోడ్లపైన ప్రయాణించాలంటేనే ప్రజలు భయపడిపోతున్నారు. వాహనచోదకులైతే మరింత వణుకుపోతున్నారు.
ఇచ్ఛాపురం రూరల్:బాలకృష్ణాపురం–డెప్పూరు రోడ్డు
మెళియాపుట్టి: కొత్తూరు గ్రామానికి వెళ్లే దారి
జిల్లాలో అధ్వానంగా రహదారులు
పట్టించుకోని కూటమి ప్రభుత్వం
చినుకు పడితే చాలు మరింత వణుకు
అడుగుకో గుంత.. గజానికో గొయ్యి


