బతుకుల్లో అలజడి
● సముద్రంలో ఎగసి పడుతున్న అలలు
● 250 మీటర్లు ముందుకు వచ్చిన సముద్రం
● మంచినీళ్లపేటలో కిలో మీటరు మేర కోతకు గురైన తీరం
● నెల రోజులుగా మత్స్యకారులకు
సాగని వేట
వజ్రపుకొత్తూరు: సముద్రం కల్లోలంగా మారింది. ఉవ్వెత్తున ఎగసి పడుతున్న అలల ఉద్ధృతి తీరాన్ని కుదిపేస్తోంది. మంచినీళ్లపేట, దేవునల్తాడ, డోకులపాడు, అక్కుపల్లి, గుణుపల్లి తీరాల్లో అలజడి ఎక్కువైంది. సముద్రం దాదాపు 250 మీటర్లు ముందుకు రావడంతో మంచినీళ్లపేటలో తీరం కిలోమీటరు మేర కోతకు గురైంది. మత్స్యకారులు తమ 30 బోట్లను నువ్వలరేవు, పూడిలంక ఉప్పుటేరులో లంగరు వేయగా, మరో 40వరకు తెప్పలను తీరంలోని ఇసుక దిబ్బలపై ఉంచారు. వల లు, ఇతర సామగ్రిని తాత్కాలిక షెడ్డుల్లో భద్ర పరిచారు.
కోనేం సీజన్ కొల్లేరే..
వరుస తుఫాన్ల నేపథ్యంలో మత్స్యకారులకు నెల రోజులుగా వేట సాగడం లేదు. ట్యూనా ఫిష్, కోనేం, రొయ్యిలు సీజన్ అయినా తుఫాన్ వల్ల మత్స్యకారులు సముద్రంలోపలకు వెళ్లలేకపోతున్నారు. గత ఏడాది ఈ సీజన్‌లో భావనపాడు, మంచినీళ్లపేట, గుణుపల్లి, అక్కుపల్లి, డోకులపా డు, నువ్వలరేవు, దేవునల్తాడ, కేఆర్ పేట తదితర తీరాల్లో దాదాపు 150 టన్నుల వరకు కోనేం, మరో 50 టన్నుల వరకు ట్యూనా (సూరలు), మరో 6 టన్నుల వరకు రొయ్యిలు మత్స్యకారుల వలకు చిక్కాయి. కానీ ఈ ఏడాది కోనేం ధర రూ.1000 వరకు ఉన్నప్పటికీ వలకు చిక్కడం లేదని గంగపుత్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో 15 రోజుల వరకే సీజన్ అనుకూలిస్తుందని, ఆ తర్వాత ఈ చేపలకు వేట చేసే అవకాశం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్షల రూపాయలు ఖర్చు చేసి రింగ్ వలలు, అలి వలలు ఇతర ఖరీదైన బోట్లు కొనుగోలు చేశామని, ఆ అప్పులు ఇంకా తీరలేదని చెబుతున్నారు. ఇంటి వద్దే ఉండిపోవాల్సి వస్తోందని, తుఫాన్ సమయంలో వేట సాగ ని పరిస్థితి ఉన్నందున ప్రభుత్వం కనీసం బస్తా బియ్యం కూడా ఇవ్వడం లేదని వాపోతున్నారు.
ఇచ్ఛాపురం రూరల్: వలలు అల్లుకుంటున్న మత్స్యకారులు
బియ్యం అందించాలి
నెల రోజులుగా వేట సాగక ఇంటి వద్దే ఉంటున్నాం. పైసా ఆదాయం లేదు. వలలు షెడ్డుల్లోనే ఉన్నాయి. అప్పులు చేసి ఎన్నాళ్లు తినగలం. ప్రభుత్వం కనికరించి కనీసం ఒక బస్తా బియ్యం అయినా ఇస్తే బాగుటుంది. – ఎస్. మోహనరావు,
మత్స్యకారుడు, మంచినీళ్లపేట
పస్తులుంటున్నాం
నెల రోజులుగా వేట సాగక పస్తులు ఉంటున్నాం. మూడు పూటలు తినాల్సిన పరిస్థితి నుంచి ఒక పూట తినే పరిస్థితి ఎదురైంది. సంద్రంలో మర బోట్ల విహారం తగ్గించాలి. దాని వల్ల మత్స్య సంపద దొరకడం లేదు.
– సీహెచ్ నీలయ్య, మత్స్యకారుడు, మంచినీళ్లపేట
బతుకుల్లో అలజడి
బతుకుల్లో అలజడి


