బాలికా విద్యపై శీతకన్ను..?
శ్రీకాకుళం: ప్రస్తుత కూటమి ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మార్క్‌ను తొలగించాలని అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటోంది. దీనిలో భాగంగానే ఇంటి వద్దకే రేషన్ బియ్యం, వలంటీర్ వ్యవస్థ రద్దు, వైద్య కళాశాలల ప్రైవేటీకరణ వంటి చర్యలకు పాల్పడింది. కాగా ఇప్పుడు ప్లస్ టూ హైస్కూళ్లపై కూడా శీతకన్ను వేస్తున్నట్లు తెలుస్తోంది. 2009 విద్యాహక్కు చట్టం ప్రకారం 18 ఏళ్లలోపు వయస్సు కలిగిన బాలికలకు ఉచిత నిర్బంధ విద్యనందించాలి. అయితే బాలికలకు గ్రామస్థాయిలో ఇంటర్మీడియట్ విద్య అందుబాటులో లేకపోవడంతో ఇతర ప్రాంతాలకు పంపించేందుకు ఇష్టంలేని తల్లి దండ్రులు పదో తరగతి తర్వాత చదువు మాన్పించేస్తున్నారు. దీనిని గుర్తించిన గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్లస్ టూ హైస్కూళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ స్కూళ్లలో బాలికలకు ఇంటర్మీడియట్ విద్యను ప్రవేశపెట్టింది. ఎంపీసీ, బైపీసీ గ్రూపులతో ఈ విద్యను ప్రారంభించారు.
జిల్లాలో 6 ప్లస్ టూ పాఠశాలలు
శ్రీకాకుళం జిల్లాలో 6 ప్లస్ టూ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వజ్రపుకొత్తూరు, టెక్కలి, నరసన్నపేట మండలంలోని ఉర్లాం, పలాస మండలంలోని బ్రాహ్మణతర్ల, సరుబుజ్జిలి మండలంలోని రొట్టవలసల్లో బాలికల కోసం ప్రత్యేకించి ప్లస్ టూ హై స్కూళ్లను ఏర్పాటు చేశారు. ఒక్కోగ్రూపులో 40 నుంచి 50 మంది వరకు చేరే అవకాశం కల్పించారు. అయితే ప్రస్తుతం ఈ 6 పాఠశాలల్లో మొత్తం 12 సబ్జెక్టు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేయడంపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు. ఎన్నికల సందర్భంలో ఇప్పటి విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ యువగళం పేరిట నిర్వహించిన పాదయాత్రలో ప్లస్ టూ ఉన్నత పాఠశాలల సమస్యలను పరిష్కరిస్తామని, ఉపాధ్యాయులకు ఆయా పాఠశాలల్లో టీజీటీ, పీజీటీలుగా పదోన్నతులు కల్పిస్తామని హామీని ఇచ్చారు. అధికారంలోకి వచ్చి ఆయన విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటికీ ఉన్న సమస్యలను పరిష్కరించకపోగా, మరిన్ని సమస్యలు పెరిగాయని పలువురు వాపోతున్నారు.
ప్రారంభమవ్వని సిలబస్
ప్లస్ టూ పాఠశాలల్లో సబ్జెక్టు పోస్టులను ఖాళీగా ఉంచితే వచ్చే ఏడాది ఇంటర్మీడియట్‌లో కొత్తగా విద్యార్థులు చేరే అవకాశాలు ఉండవు. ఇదే జరిగితే వీటిని ఎత్తివేయొచ్చనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉన్నట్లు ఉపాధ్యాయ వర్గాలు విమర్శిస్తున్నాయి. ప్రభుత్వం వీటిలోని సమస్యలను పరిష్కరించకపోవడంతో ఈ విమర్శలకు బలం చేకూరుస్తోంది. అందువలన ఇప్పటికై నా సబ్జెక్ట్ ఉపాధ్యాయులను నియమించకుంటే మరో ఐదు నెలల్లో జరగనున్న పరీక్షలకు విద్యార్థినులు సన్నద్ధమయ్యే అవకాశాలు దెబ్బతింటాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్య క్యాలెండర్ ప్రకారం నవంబర్ నాటికి సిలబస్ పూర్తిచేసి అటు తర్వాత రివిజన్ చేయించాల్సి ఉంటుంది. అయితే కొన్ని ప్లస్ టూ పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల కొరత వలన ఇప్పటికీ పలు సబ్జెక్టుల్లో పాఠాలు ప్రారంభమవ్వకపోవడం విచారించదగ్గ విషయం. అందువలన ఇప్పటికై నా జిల్లా అధికారులు దృష్టి సారించి ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాల్సిన అవసరం ఉంది.
జిల్లాలోని ప్లస్ టూ హైస్కూళ్లలో
12 పోస్టులు ఖాళీ
మరో ఐదు నెలల్లో పరీక్షలు
సిలబస్ పూర్తవ్వకపోవడంతో ఆందోళన
బాల్య వివాహాల నిర్మూలన
చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ ఇండియా పాలసీ అండ్ రీసెర్చ్ అనే సంస్థ ప్లస్ టూ విద్య వలన బాల్య వివాహాల నిర్మూలన సాధ్యపడుతుందని స్పష్టంగా పేర్కొంది. కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ ప్లస్ టూ పాఠశాలలను నిర్వీర్యం చేస్తోంది. ఇది 2009 విద్యాహక్కు చట్టాన్ని ఉల్లంఘించడమే. తక్షణమే ఖాళీలను భర్తీ చేయాల్సిన అవసరం ఉంది.
– పేడాడ ప్రభాకరరావు, ఎస్టీయూ జిల్లా నాయకుడు
బాలికా విద్యపై శీతకన్ను..?


