దెబ్బకు ఠా.. దొంగల ముఠా | - | Sakshi
Sakshi News home page

దెబ్బకు ఠా.. దొంగల ముఠా

Oct 28 2025 7:42 AM | Updated on Oct 28 2025 7:42 AM

దెబ్బ

దెబ్బకు ఠా.. దొంగల ముఠా

కాకినాడ ముఠాను పట్టుకున్న పోలీసులు

ఒక్కొక్కరిపై లెక్కకు మించి కేసులు

నిందితుల నుంచి 186 గ్రాముల బంగారం, 263 గ్రాముల వెండి స్వాధీనం

శ్రీకాకుళం క్రైమ్‌:

రాత్రిపూట ఇళ్లకు కన్నాలు వేసి ఆభరణాలు దోచుకుపోయే కాకినాడ దొంగల ముఠాను శ్రీకాకుళం రూరల్‌ పోలీసులు పట్టుకున్నారు. నిందితులైన రేకడి వెంకటేశ్వర్లు, ధర్మాది ప్రసాద్‌, మాడెం మోహన్‌కుమార్‌ల వద్ద నుంచి 186 గ్రాముల బంగారం, 263 గ్రాముల వెండిని స్వాధీనం చేసుకుని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో అదనపు ఎస్పీ(క్రైమ్‌) పి.శ్రీనివాసరావు విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.

పదేళ్ల నుంచి నేరాలు

కాకినాడ జగన్నాయకపురానికి చెందిన వెంకటేశ్వర్లు, ప్రసాద్‌లు గత పదేళ్లు నుంచి చోరీలు చేస్తున్నారు. ఒకరు రాత్రిపూట తాళాలు వేసిన ఇళ్ల తలుపులను విరగ్గొట్టే రకమైతే, మరొకడు బీరువా తాళాలు అలవోకగా తెరిచేవాడు. వెంకటేశ్వర్లుపై 23 కేసులుండగా, ప్రసాద్‌పై 36 ఉన్నాయి. ఇద్దరిపై కాకినాడ–4 టౌన్‌, 1 టౌన్‌లో సస్పెక్ట్‌ షీట్లు కూడా ఉన్నాయి. కాకినాడలో చోరీలకు సంబంధించి అక్కడి సెంట్రల్‌ జైల్‌కు ఈ ఏడాది ఏప్రిల్‌లో వెళ్లిన వీరికి, అక్కడ హత్యానేరంతో వచ్చిన కాకినాడ రాసిల్లిపేటకు చెందిన మాడెం మోహన్‌కుమార్‌ పరిచయమయ్యాడు. ఆగస్టు వరకు అదే జైలులో వీరి సావాసం బలపడింది. మోహన్‌కుమార్‌ చోరీ సొత్తు అమ్మడంలో, జైలుకు వెళ్లిన నేరస్తులను బెయిల్‌పై తీసుకొచ్చి కొత్త నేరాలు చేయించడంలో దిట్ట. ఈ క్రమంలో గత నెల 28వ తేదీన రాత్రి గార మండలంలోని కె.మత్స్యలేశం – కళింగపట్నం పోర్టులో వరుసగా మూడిళ్లపై చోరీకి ఎగబడ్డారు. అలాగే నందగిరిపేట, రూరల్‌ మండలం రాగోలులో కూడా చోరీలు చేశారు.

ఫింగర్‌ ప్రింట్‌ సాయంతో

గారలో మూడిళ్లవారు ఒకరు 45 తులాలని, మరొకరు 25 తులాలని, ఇంకొకరు 10 తులాలు పోయాయని ఫిర్యాదులో పేర్కొనడంతో పోలీసులు అతిపెద్ద కేసు అని డీఎస్పీ వివేకానంద పర్యవేక్షక్షణలో సీఐ పైడపునాయుడు, గార, రూరల్‌ ఎస్‌ఐలు టీమ్‌లుగా ఏర్పడ్డారు. ఫింగర్‌ ప్రింట్‌ సీఐ భరత్‌కుమార్‌ తన క్లూస్‌టీమ్‌తో ఆధారాలు సేకరించి వెరిఫై చేయడం, అవి కాకినాడ జిల్లాకు చెందిన ముద్దాయిలుగా ట్రేస్‌ కావడంతో విచారణ చేపట్టారు. వీరు ఈనెల 26న తండేవలస వైపు వెళ్లే తారురోడ్డుకు కుడివైపున ఉన్న జగనన్న కాలనీలో నిర్మాణంలో ఉన్న ఓ ఇంటి వద్ద ఉన్నారన్న సమాచారం తెలుసుకున్న రూరల్‌ ఎస్‌ఐ రాము రెవెన్యూ అధికారుల సమక్షంలో తమ సిబ్బందితో కలిసి పట్టుకున్నారు.

తప్పుడు ఫిర్యాదులు

గారలో ఒకరు ఇచ్చిన ఫిర్యాదులో 45 తులాలు పోయిందని చెప్పారని, కానీ 15 తులాలే పోయాయని, మిగతా ఇద్దరిళ్లల్లో ఏమీ పోలేదని, దూసిలో ఒక ఫిర్యాదుదారు 17 తులాలు పోయిందని అన్నారని, కానీ వారింట్లో పోయింది కేవలం రూ.800 లేనని అదనపు ఎస్పీ వెల్లడించారు. కాశీబుగ్గలో కూడా తొమ్మిది బంగారు వస్తువులు 43 తులాలున్నాయని ఫిర్యాదిచ్చారని, వాస్తవంగా 30 తులాలు పోయిందన్నారు. ఇకపై ఇటువంటి తప్పుడు ఫిర్యాదులు ఇస్తే న్యాయపరంగా సలహాలు తీసుకుని కేసులు కడతామన్నారు. పట్టుకోవడంలో కృషి చేసిన ఫింగర్‌ ప్రింట్‌ సీఐ భరత్‌కుమార్‌, సీఐ పైడపునాయుడు, ఎస్‌ఐ రాము, కానిస్టేబుల్‌ జగదీష్‌లను అభినందించారు.

దెబ్బకు ఠా.. దొంగల ముఠా 1
1/1

దెబ్బకు ఠా.. దొంగల ముఠా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement