ఖబడ్దార్...!
కామాంధులారా..
పోక్సో యాక్ట్
● చిన్నారులపై లైంగిక దాడులకు
పాల్పడితే జైలుకే
● నేర తీవ్రత ఆధారంగా జీవిత ఖైదు లేదంటే మరణ శిక్షే
● బాధితులకు అండగా పోక్సో చట్టం
భయపడకూడదు
పరువు పోతుందేమోనని, ఎవరో ఏదో చేస్తారని జరిగేదానిపై ఫిర్యాదు ఇవ్వడానికి భయపడకూడదు. వివరాలు గోప్యంగా ఉంచుతాం. మీడియా రంగాలు కూడా ఎట్టిపరిస్థితుల్లో బాలిక,బాలిక కుటుంబం, గ్రామం పేర్లు రాయవద్దు. పోక్సో కేసుల్లో ఉపేక్షించేదే లేదు. రాజకీయ పైరవీలు అస్సలుండవు. గుడ్‌టచ్ – బ్యాడ్‌టచ్‌పై నిత్యం బాలికలను అవగాహన కల్పించాలి. – కేవీ మహేశ్వరరెడ్డి, ఎస్పీ, శ్రీకాకుళం
తల్లిదండ్రుల పాత్ర కీలకం
పిల్లల ఎదుగుదలలో తల్లిదండ్రులదే కీలకపాత్ర. తల్లి అతిగా మద్యం సేవించే వీక్నెస్ వలనే ఇటీవల ఓ బాలికపై అఘాయిత్యం జరిగింది. ఇంటర్నెట్ వాడకం, పోర్నుసైట్లు ఎక్కువగా చూడటం, తల్లిదండ్రులు విడిపోవడం, వారి వివాహేతర సంబంధాలు, భార్యాభర్తలు ఉద్యోగాల్లో ఉంటూ పిల్లలను పట్టించుకోకపోవడం కూడా కొన్ని అనర్థాలకు కారణమవుతున్నాయి. ఆటోల్లో, బస్సుల్లో విద్యార్థినుల రోజువారీ పరిస్థితి తెలుసుకోవాలి.
– సీహెచ్ వివేకానంద, డీఎస్పీ, శ్రీకాకుళం
శ్రీకాకుళం క్రైమ్:
జిల్లాలో బాలికలపై రోజురోజుకీ ఆకృత్యాలు పెరిగిపోతున్నాయి. కీచక కామాంధులు రెచ్చిపోతున్నారు. పోలీసు అధికారులు దారుణాలు జరగకుండా అనేక చర్యలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ చిన్నారులపై కామాంధుల ఆగడాలకు ఫుల్‌స్టాప్ పడడం లేదు. అనేక చోట్ల చిన్నారులను చిదిమేసే మృగాళ్లు తారసపడుతూనే ఉన్నారు. కఠిన చట్టాలు ఉన్నప్పటికీ భయం లేకుండా బరితెగిస్తున్నారు.
కారణాల్లో కొన్ని పరిశీలిస్తే...
బాల కార్మిక వ్యవస్థ ఇప్పటికీ ఉండడంతో కొన్నిచోట్ల యజమానులు బాలికలపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. అలాగే విద్యాసంస్థలు, వసతి గృహాల్లో సిబ్బంది మానవత్వం మరిచిపోయి ప్రవర్తిస్తున్నారు. మద్యం మత్తు, అశ్లీల వెబ్‌సైట్లు యువత నుంచి వృద్ధులు వరకు వక్రబుద్ధికి ప్రేరేపిస్తున్నాయి. దీనికితోడు పల్లె ప్రజల్లో అమాయకత్వం, పెద్దల్లో రాజీతత్వం, అన్నింటికీ మించి తల్లిదండ్రుల్లో, కుటుంబీకుల్లో అవగాహనా రాహిత్యం కూడా కారణాలుగా చెప్పుకోవచ్చు.
ఏంటీ పోక్సో చట్టం..?
1992లో ప్రపంచంలో పెరుగుతున్న జనాభాలో యువతపై అధిక శాతం లైంగిక దాడులు పెరుగుతాయనే ఉద్దేశంతో ఐక్యరాజ్య సమితి కొన్ని సభ్యత్వ దేశాలతో చట్టాలను చేయాలని తీర్మానాలు చేసింది. దీనిలో భాగంగా బాలికలు, మహిళలపై జరుగు ఆకృత్యాలకు కొన్ని శిక్షలు అమలయ్యేవి. అయితే ఆధునిక సమాజంలో బాలికలపై మరిన్ని విశృంఖల దాడులు పెరగడంతో 2012లో చట్టాన్ని సవరించి పోక్సో యాక్ట్(ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రం సెక్సువల్ అఫెన్సెస్) అమల్లోకి తీసుకొచ్చారు. దీని ప్రకారం మైనర్ బాలికపై ఒక గీత పడినా.. తాకరాని చోట తాకినా.. ఆమె ఇష్టంతో చేయి వేసినా, అంగీకారంతో తీసుకుపోయినా, అక్రమ రవాణా చేసినా, అశ్లీల, వాణిజ్య ప్రయోజనాలకై అసాంఘిక కలాపాల్లో ప్రేరేపించినట్లు చేసినా జైలు ఊచలు లేదంటే మరణ శిక్ష అమలు చేస్తారు. అమాయక బాధిత బాలికలను సంరక్షించాలి, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడిన నేరస్తులకు కఠినంగా శిక్షించాలన్నదే ఈ చట్టం ముఖ్య ఉద్దేశం.
ప్రత్యేక కోర్టులు
బాలిక నేరుగా పోలీసులకిచ్చిన ఫిర్యాదులో తనపై అసభ్యంగా ప్రవర్తించారని ఒక్క మాట చెబితే చాలు అదే ఫైనల్ అని.. వెంటనే పోక్సో కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించాలని సుప్రీంకోర్టే చెప్పింది. ఆ తర్వాత దర్యాప్తులో తనేం తప్పు చేయలేదని నిందితుడు నిరూపించుకుంటే తప్ప శిక్ష తప్పదు. బాలికపై అఘాయిత్యానికి సంబంధించి తల్లిదండ్రుల వద్ద స్టేట్‌మెంట్, బాలిక స్టేట్‌మెంట్, ప్రత్యక్ష సాక్షుల స్టేట్‌మెంట్, దర్యాప్తు, విచారణ, మెడికల్ అవిడెన్స్, సపోర్ట్‌లు అన్నీ వీడియో రికార్డు చేయాల్సి ఉంటుంది. ఆకరికి పోక్సో కేసులకంటూ ఉండే ప్రత్యేక కోర్టులో సైతం నాలుగు గోడల మధ్య బాలిక వాంగ్మూలం మేజిస్ట్రేట్ తీసుకోవడం కూడా రికార్డు అవుతుంది. కోర్టులో ట్రయల్ రన్స్ నుంచి కన్విక్షన్ (నేరారోపణ రుజువయ్యేవరకు) వరకు వీడియో రికార్డు అవిడెన్స్‌లు భద్రపరుస్తారు. ఇదంతా చేసేది దర్యాప్తు, విచారణలో అనుమానాలుండకూదని, బాలికల వయసు నిర్ధారణ, సాక్ష్యాల తారుమారు కాకూడదని, మళ్లీ ఫిర్యాదులు రాకూడదనే ఉద్దేశంతోనే. ఫిర్యాదు చేసేందుకు 100, 112, 1098, సమీప పోలీస్‌స్టేషన్ ఎస్‌హెచ్‌వో నుంచి జిల్లా ఎస్పీ వరకు నేరుగా ఎవరినైనా సంప్రదించవచ్చు.
ఖబడ్దార్...!
ఖబడ్దార్...!
ఖబడ్దార్...!


