అటు నిర్బంధం.. ఇటు నినాదం
సరుబుజ్జిలి: థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు వ్యతిరేకంగా థర్మల్ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వ ర్యంలో సరుబుజ్జిలి తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో సోమవారం తలపెట్టిన మహాధర్నా కార్యక్రమాన్ని పోలీసు బృందాలు అడ్డుకున్నాయి. థర్మల్ పవర్ ప్లాంట్ వల్ల కలిగే అనర్థాల గురించి ప్రజలకు అవగాహన కల్పించి తహసీల్దార్ కార్యాలయం ఎదుట శాంతియుతంగా ధర్నా నిర్వహించి తహసీల్దార్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు పోరాట కమిటీ నాయకులు సిద్ధమయ్యారు.
ఎక్కడికక్కడ అరెస్టులు
మహాధర్నా చేసేందుకు ఎలాంటి అనుమతులు లేవంటూ శ్రీకాకుళం డీఎస్పీ వివేకానంద ఆధ్వర్యంలో ముగ్గురు సీఐలు, 10 మంది ఎస్‌ఐలు వివి ధ రకాల పోలీసు సిబ్బందితో పవర్ ప్లాంట్ ప్రతిపాదిత ప్రదేశాలు, రహదారుల వద్ద మోహరించారు. మహాధర్నా కార్యక్రమానికి వస్తున్న థర్మల్ వ్యతిరేక పోరాట కమిటీ కన్వీనర్ వాబ యోగిని అదుపులోకి తీసుకొని పోలాకి, నరసన్నపేట పోలీసులు స్టేషన్లకు తరలించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావుని శ్రీకాకుళంలో టూ టౌన్‌స్టేషన్‌కు తరలించారు. సరుబుజ్జిలి జంక్షన్‌లో ఫ్లెక్సీతో నిరసనలు తెలిపి తహసీల్దార్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్తున్న సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి తేజేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షుడు ప్రకాష్, మండల కన్వీనర్ అదపాక రాజేష్, సింగూరు గోపాలరావు, రైతుసంఘం జిల్లా అధ్యక్షుడు కోనాడ మోహనరావులను అదుపులోకి తీసుకొని స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. స్థానిక గిరిజన నాయకులను బూర్జ పోలీసుస్టేషన్‌కు తరలించారు.
ప్రధాన రహదారిపై నిరసనలు
మహాధర్నా కార్యక్రమాన్ని భగ్నం చేసిన పోలీసులపై గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు మండలాలకు చెందిన గిరిజనులు భారీగా తరలిరాగా.. పోలీసులు చిగురువలస జంక్షన్ వద్ద వారి ని అడ్డుకున్నారు. దీంతో పాలకొండ రహదారిపై నిరసనలు తెలిపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చాలాసేపు ట్రాఫిక్ ఆగిపోయింది. అదుపులో ఉన్న ఉద్యమకారులను విచిపెట్టే వరకు కదిలేది లేదని గిరిజనులు భీష్మించారు. ఒక దశలో నిరసనలు తెలుపుతున్న గిరిజనులను పోలీస్‌స్టేషన్లకు తరలించేందుకు పోలీసులు వాహనాలు సిద్ధం చేశారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని గిరిజనులు ధర్నా విరమించారు.
నిర్బంధాలతో ఉద్యమం ఆగదు
ప్రజల పక్షాన పోరాటాలు చేస్తున్న ఉద్యమకారులను నిర్బంధిస్తే థర్మల్ ప్లాంట్ ఉద్యమం ఆగదని థర్మల్ వ్యతిరేక పోరాట కమిటీ కన్వీనర్ వాబ యోగి తెలిపారు. ధర్నాకు వస్తున్న సమయంలో సోమవారం పోలీసులు అదపులోకి తీసుకొని విడి చిపెట్టిన తర్వాత సరుబుజ్జిలి, బూర్జ మండలాల పరిధిలోని వెన్నెలవలస, అడ్డూరిపేట, తిమడాం గ్రామాల్లో పర్యటించి అధైర్యపడవద్దని గిరిజనులకు భరోసా కల్పించారు.
థర్మల్‌కు వ్యతిరేకంగా నినదించిన గిరిజన లోకం
అడుగడుగునా అడ్డుకున్న పోలీసులు
పోరాట కమిటీ నేతలను అదుపులోకి తీసుకున్న వైనం
అటు నిర్బంధం.. ఇటు నినాదం


