
పరమ పవిత్రం.. కార్తీకం
● 22 నుంచి కార్తీక మాసం ఆరంభం
● ముస్తాబవుతున్న దేవాలయాలు
హిరమండలం: పరమ పవిత్రమైన కార్తీక మాసం రానే వస్తోంది. ఈ నెల రోజులూ దైవ భక్తిలో ఉంటే ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖసంతోషా లు కలుగుతాయన్నది భక్తుల ప్రగాడ విశ్వాసం. ఈ మాసంలో దీపారాధనకు అనేక శుభ ఫలితాలు కలుగుతాయని నమ్ముతారు. దీపాన్ని దైవ స్వరూపంగా భావించి పూజలు చేస్తారు. కార్తీక సోమవారాల్లో చేసే దీపారాధన, ఉసిరి చెట్టు కింద పూజలు, వనభోజనాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని పండితులు చెబుతున్నారు. అక్టోబర్ 22 నుంచి ప్రారంభమయ్యే కార్తీక మాసంలో నాలుగు వారాలు ఈ పూజలు కొనసాగుతాయి.
దీపారాధన ప్రత్యేకత
కార్తీక మాసంలో ఒక్కో రకమైన ప్రమిదలో దీపం వెలిగిస్తే ఒక్కో రకమైన మంచి జరుగుతుందని నమ్ముతారు. మట్టి ప్రమిదలో వెలిగిస్తే దైవానుగ్రహం కలుగుతుందని, పింగాణి ప్రమిదలో దీపం వెలిగిస్తే ఆ ఇంటి వారికి అలంకరణ వస్తువులు సమకూరుతాయని, ఇత్తడి ప్రమిదలో దీపాలు వెలిగిస్తే ఆ ఇంట్లో దైవశక్తి అధికవవుతుందని, కంచు ప్రమిదలో వెలిగిస్తే ఆయుష్సు పెరుగుతుందని పెద్దలు చెబుతుంటారు. నిమ్మ ప్రమిదల్లో వెలిగిస్తే అన్ని కార్యాల్లోని విజయం సిద్ధిస్తుందని, అరటి దోనెలో దీపం వెలిగించి నీటిలో వదిలితే మానసిక సంతృప్తి, ధన రక్షణ కలుగుతుందని, ఉసిరికాయల దీపం వెలిగిస్తే పాపాలు తొలగిపోతాయని కూడా చాలా మంది విశ్వసిస్తారు.
శివకేశవులకు సమప్రాధాన్యం
కార్తీకమాసం శివుడికి, విష్ణువుకి ప్రతీకరమైంది. అందుకే ఈ మాసం ప్రతి సోమవారం శివుడికి, ప్రతి శుక్ర, శని వారాల్లో విష్ణుమూర్తికి ప్రత్యేక పూజ లు చేస్తారు.
శివపార్వతుల పుత్రుడైన అయ్యప్ప దీక్షలు ఈ మాసంలోనే ప్రారంభమవుతాయి. శివుడికి రుద్రాబిషేకం, బిళ్వార్చన, విష్ణువుకి తులసీ దళార్చన ఈ మాసంలోనే అత్యంత భక్తిశ్రద్దలతో నిర్వహిస్తారు. లక్ష్మీదేవి, కార్తికేయుడు, చంద్రుడు, ఇంద్రుడు, తులసిమాత, ఉసిరి చెట్టుకు ప్రత్యేక పూజలు చేయడం కూడా ఆనవాయితీగా వస్తోంది.

పరమ పవిత్రం.. కార్తీకం