
ఆ ఊళ్లే దీపావళి
గార, టెక్కలి: జిల్లాలో దీపావళి పేరిట రెండు గ్రామాలు ఉన్నాయి. గార మండలంలోని ఓ గ్రామం ఉంటే.. టెక్కలి మండలంలో మరో గ్రామం ఉంది. గార మండలంలోని దీపావళి గ్రామానికి ఆ పేరు రావడానికి ఓ కథ ప్రచారంలో ఉంది. దాని ప్రకారం.. ఓ కళింగ రాజు ఇటుగా వస్తూ ఈ గ్రామానికి దీపావళి అనే పేరు పెట్టారు. అప్పటి వరకు ఈ ప్రాంతాన్ని గూడెం అని పిలిచేవారట. ఆ రాజు ప్రతి రోజూ శ్రీకాకుళం నుంచి శ్రీకూర్మం వరకు గుర్రంపై వెళ్లేవారట. మార్గం మధ్యలో లక్ష్మీనారాయణ స్వామి ఆలయం వద్ద ఆగి స్వామిని దర్శించుకునేవారు. ఒక రోజు శ్రీకూర్మం వెళ్లి వస్తూ
ఇక్కడ సొమ్మసిల్లి పడిపోయారు. ఇక్కడి వారు ఆయనకు సాయం చేయగా కోలుకున్నారు. ఊరి వారిని గ్రామం పేరు అడగ్గా పేరేమీ లేదని చెప్పారు. ఆ రోజు దీపావళి కావడంతో ఆ ఊరికి దీపావళి అనే పేరును పెట్టారు. రెవెన్యూ రికార్డుల్లోనూ ఈ పేరే ఉంది. టెక్కలి మండలం అయోధ్యపురం పంచాయతీ పరిధిలో ‘దీపావళి’ గ్రామం ఒకటి. టెక్కలి నుంచి బన్నువాడ గ్రామం మీదుగా సుమారు 7 కిలోమీటర్ల దూరంలో మారుమూల ప్రాంతంలో ఈ దీపావళి గ్రామం ఉంది. పండగ పేరుతో ఉన్న ఈ గ్రామంలో మొత్తం 50 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. దీపావళి పేరుతో గ్రామానికి ప్రత్యేక గుర్తింపు ఉంది.

ఆ ఊళ్లే దీపావళి