
నిబంధనలకు నీళ్లు!
● పెట్రోల్, డీజిల్లో నీరు కలుస్తోందంటూ వినియోగదారుల గగ్గోలు
● బంకుల్లో కానరాని సౌకర్యాలు
● తనిఖీలు చేయని అధికారులు
సంతబొమ్మాళి మండలం బోరుభద్ర పెట్రోల్ బంక్‌లో గొదలాం గ్రామానికి చెందిన పాలిన శ్రీనివాసరావు వంద రూపాయల పెట్రోల్ కొట్టించాడు. రెండు రోజుల వ్యవసాయ పనుల తర్వాత వాహనాన్ని స్టార్ట్ చేయాలని చూడాగా అవ్వకపోవడంతో మెకానిక్‌కు చూపించాడు. పెట్రోల్‌లో నీరు కలవడం వల్ల బండి స్టార్ట్ కావడం లేదని చెప్పడంతో విషయాన్ని బంకు యజమాని దృష్టికి తీసుకెళ్లాడు. ఆయన పట్టించుకోకపోవడంతో తహసీల్దార్ హేమసుందర్‌రావుకు ఫిర్యాదు చేశాడు. గత నెలలో ఈ ఘటన జరిగింది. ఇలాంటివి తరచూ ఎక్కడో ఓ చోటు జరుగుతున్నా అధికారులు దృష్టి సారించడం లేదు.
శ్రీకాకుళం: పెట్రోల్, డీజిల్ కల్తీ జరుగుతోందంటూ ఇటీవల కాలంలో పలువురు వాహనచోదకులు ఆందోళనకు దిగుతున్నారు. పలువురు నిర్వాహకులు కొలతల్లో వ్యత్యాసం, కల్తీకి పాల్పడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పెట్రోల్ బంకులపై ఎప్పటికప్పుడు తనిఖీ చేయాల్సిన అధికారులు మౌనముద్రలో ఉండిపోవడంపై పలువురు ఆక్షేపిస్తున్నారు. పెట్రోల్ డీజిల్ నాణ్యత లేకపోవడం వల్ల వాహనాలు తరచూ మరమతులకు గురవుతున్నాయి. వాస్తవానికి బంకు నిర్వహించే డీలర్లకు ప్రభుత్వ సంస్థలు, ప్రైవేటు యాజమాన్యాలు కమిషన్ సక్రమంగానే చెల్లిస్తున్నా కొందరు యజమానులు అత్యాశకు పోయి కల్తీలకు, కొలతల్లో వ్యత్యాసాలకు పాల్పడుతున్నారు. జిల్లాలో 149 పెట్రోల్ బంకులు ఉండగా, వీటి ద్వారా రోజుకు పెట్రోల్ ,డీజిల్ కలసి మూడు లక్షల లీటర్ల వరకు విక్రయిస్తున్నారు.
కనీస సౌకర్యాలు కరువు..
నిబంధనల మేరకు ప్రతి పెట్రోల్ బంక్‌లోనూ ఉచితంగా గాలిని నింపే యంత్రాలతో పాటు వినియోగదారులకు తాగునీరును అందుబాటులో ఉంచాల్సి ఉంటుంది. బంక్ ఆవరణలో మరుగుదొడ్లు కచ్చితంగా ఉండాలి. గాలి యంత్రాలు ఉన్నప్పటికీ అవి అలంకారప్రాయంగానే దర్శనమిస్తున్నాయి. ఎవరైనా గాలి కోసం అడిగితే దానిని నిర్వహించే వ్యక్తి సెలవులో ఉన్నాడనో మరేదో కారణం చెప్పి పంపించేస్తున్నారు. మరుగుదొడ్లు ఉన్నట్లు బోర్డులు ఉన్నా వాటికి తాళాలు వేసి ఉంచుతున్నారు. దాదాపుగా 90 శాతం బంకుల్లో మంచినీటి సౌకర్యమే ఉండడం లేదు. ప్రైవేట్ వ్యక్తులు నిర్వహిస్తున్న బంకుల్లోనే కాకుండా ప్రభుత్వ శాఖల ఆధీనంలో ఉన్న బంకుల్లో సైతం దాదాపు ఇదే పరిస్థితి. ఇప్పటికై నా అధికారులు స్పందించి బంకులపై దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు..
పెట్రోల్ బంకులపై దృష్టి సారిస్తాం. నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటాం. త్వరలోనే పూర్తిస్థాయిలో తనిఖీలు చేపట్టి కేసులు నమోదు చేస్తాం.
– చిన్నమ్మలు,
తూనికలు కొలతల శాఖ అధికారి